హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు తెల్లవారుజామున మూడు గంటలకు అరెస్టు చేశారు. ఆయన ఇంట్లో 24 గంటల పాటు సోదాలు నిర్వహించగా.. కోట్ల రూపాయలు విలువ చేసే 73 వాచీలు, 50 లక్షల నగదుతో పాటు కోట్ల రూపాయల విలువ చేసే వ్యవసాయ భూమి పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గురువారం ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశముందని తెలిసింది. అనధికార లెక్కల ప్రకారం.. ఆయన మొత్తం అక్రమ ఆస్తుల విలువ ఎంతలేదన్నా రూ.500 కోట్లు దాటుతుందని సమాచారం. కోట్లాది రూపాయల్ని విలువ చేసే వాచీలు ఎవరెవరు ఇచ్చారనే దిశగా కూడా ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారని తెలిసింది. 25 యాపిల్ ఫోన్లు, యాభైకి పైగా ల్యాప్‌టాపులు దొరికాయి. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆయన వడ్డీకి సొమ్ము ఇచ్చారని.. మరికొన్ని రియాల్టీ సంస్థల్లో ఆయన పెట్టుబడుల్ని పెట్టారని అధికారులు తెలుసుకున్నారు. అయితే, ఆయనతో పాటు కుటుంబ సభ్యులు దర్యాప్తునకు పెద్దగా సహకరించట్లేదు.