జీవో నంబరు 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి పునఃపరిశీలన పూర్తయ్యే వరకు నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులు ఇవ్వరాదని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదివారం అత్యవసరంగా ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలిపేయాలని చీఫ్ సిటీ ప్లానర్, జోనల్ కమిషనర్లు, అదనపు సిటీ చీఫ్ ప్లానర్లు, సిటీ ప్లానర్లు, డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ సిటీ ప్లానర్లు, సహాయ సిటీ ప్లానర్లను ఆదేశించారు. అక్రమ క్రమబద్ధీకరణపై ఫిర్యాదులు రావడంతో తెలంగాణ ప్రభుత్వ భూ పరిపాలన చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ) నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. ఏమైనా సందేహాలుంటే కలెక్టర్ కార్యాలయం నుంచి నివృత్తి చేసుకోవాలన్నారు.