ఆదాయానికి మించి ఆస్తులున్న ఆరోపణలపై రెరా సభ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వ్యుల్ని జారీ చేశారు. టీఎస్ రెరా సభ్య కార్యదర్శి, హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శివబాలకృష్ణపై జనవరి 23న ఐటీ అధికారులు సోదాల్ని నిర్వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆదిత్యా హోమ్స్ సంస్థ పొప్పాల్ గూడలో నిర్మించిన ఆదిత్యా ఫోర్ట్ వ్యూ ప్రాజెక్టులోని 25వ నెంబర్ విల్లాతో పాటు ఏకకాలంలో 14 ఇతర ప్రదేశాల్లో సోదాల్ని నిర్వహించారు. అతని వద్ద అనేక స్థలాలకు సంబంధించిన పత్రాలు దొరికాయి. అవన్నీ ఎక్కువగా బినామీ పేర్ల మీద ఉండటం గమనార్హం. నగదు సుమారు రూ.84. 60 లక్షలు, కిలో 800 గ్రాముల బంగారం దొరికాయి. రూ.8,26,48,999 విలువైన ఆస్తుల పత్రాలు దొరికాయి. అదనంగా రూ.7.63 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తులు లభించాయి. మార్కెట్లో వీటి విలువ ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం. ఆయన్ని 24న అరెస్టు చేసి.. 25న ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన కేసు దర్యాప్తులో ఉంది. దీంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన నిర్ణయం.. అక్రమాస్తులు కలిగిన బాలకృష్ణ సస్పెండ్
Government Suspended TS Rera Member Secretary Shiva Balakrishna