తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో.. క్రెడాయ్ హైదరాబాద్ నిర్వహించిన ప్రాపర్టీషోకు అప్పటి సీఎం కేసీఆర్ విచ్చేసి.. రియాల్టీ సమస్యలన్నీ తెలుసుకుని.. ఈ రంగాన్ని నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి వివరించారు. ఆతర్వాత ఏకకాలంలో జీవోలను విడుదల చేసి రియాల్టీ సమస్యల్ని పరిష్కరించారు. కానీ, కొత్త ప్రభుత్వం నుంచి అలాంటి చర్యల్ని ఆశించడం అత్యాశే అవుతుందా?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రియల్ రంగాన్ని అభివృద్ధి చేస్తామని.. ప్రపంచస్థాయి నగరంగా నిలబెడతామని.. ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హామీల వర్షం కురిపించారు. పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన టన్నెల్ బోర్ మెషీన్ టెక్నాలజీని ప్రవేశపెడతామని మాటిచ్చారు. ఆయా పరిజ్ఞానంతోనే హైదరాబాద్‌లో రహదారుల్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తను కూడా రియల్ రంగం నుంచి వచ్చాను కాబట్టి.. ఈ పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహానిస్తామని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలైనప్పటికీ, ఇంతవరకూ పురపాలక శాఖ మీద ఆయన సమీక్ష నిర్వహించలేదు. రియాల్టీ వృద్ధి గురించి ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటారో స్పష్టం చేయలేదు. దీంతో హైదరాబాద్ రియల్ పరిశ్రమ డైలామాలో పడింది.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్లకే.. క్రెడాయ్ హైదరాబాద్ బృందం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. తర్వాత తీరిగ్గా కలుద్దామని వారితో ఆయన చెప్పినట్లు తెలిసింది. సీఐఐ తెలంగాణ ప్రతినిధి బృందం దావోస్ వెళ్లి ప్రత్యేకంగా సీఎంని కలిసి అభినందనలు తెలియజేసింది. అయినా, ఆయన కాకతీయ హోటల్లో నిర్వహించిన రియల్ ఎస్టేట్ సమ్మిట్‌కు హాజరు కాలేదు. సీఎం తరఫున ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి కనీసం అరగంట కూడా ఖాళీ చేసుకోలేకపోయారు. రియల్ రంగం వృద్ధి చెందడానికి సీఎం భరోసానిస్తే చాలు.. కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించక్కర్లేదు. ఏదీఏమైనా, రియల్ రంగం వృద్ధి చెందడానికి సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో సమీక్ష నిర్వహిస్తారని ఆశిద్దాం.