- మన మురికి మూసి ఎప్పుడయ్యేను?
- గత పదేళ్లలో పెద్దగా చేసిందేమీ లేదు!
- ఈ ఐదేళ్లలో అద్భుతం జరుగుతుందా?
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మురికి మూసిని జలరాశి చేసేందుకు తీవ్రంగా కృషి చేసింది. అప్పటి పురపాలక శాఖ అధికారులు పలుసార్లు సబర్మతి నదిని సందర్శించారు. ఇక్కడికొచ్చి అదేరీతిలో అభివృద్ధి చేస్తామని ప్రకటనలు గుప్పించారు. ప్రత్యేకంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ను ఏర్పాటు చేశారు. బ్యాంకుల నుంచి రుణాల్ని తీసుకున్నారు. కానీ, ఆ ప్రాజెక్టు ఇంతవరకూ ఎంతమేరకు పురోగతి చెందిందో పెద్దగా తెలియలేదు. కాకపోతే, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటూ కొంతకాలం హడావిడి జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూసీ సుందరీకరణకు ప్రాధాన్యతనిస్తామని ప్రకటించారు. మళ్లీ హడావిడి మొదలైంది. సబర్మతి నది బదులు ఈ ప్రభుత్వం ఏకంగా లండన్ థేమ్స్ నది తరహాలో డెవలప్ చేసే పనిలో నిమగ్నమైంది. అయితే, ఇక్కడ ప్రతిఒక్కరూ ఒక వాస్తవం తెలుసుకోవాలి. లండన్ థేమ్స్ నది పరివాహక ప్రాంతం రెండేళ్లలోనో ఐదేళ్లలోనో జరగలేదు. ప్రభుత్వాలు కలిసికట్టుగా కొన్నేండ్ల పాటు కృషి చేయడం వల్లే ప్రస్తుత పరిస్థితికి వచ్చింది.
లండన్ థేమ్స్ నదిని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధికి ప్రభుత్వానికి ఉండటమే కాదు.. అందుకోసం నిధుల్ని కేటాయించింది. ఆ క్రతువులో టౌన్ ప్లానర్లు, ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, సిటీ అభివృద్ధి సంఘాలు, ఎన్జీవోలు వంటివారినంతా భాగస్వామ్యుల్ని చేసింది. గొప్ప మేథోమధనం జరిగింది. పక్కా ప్రణాళికలతో కొన్నేళ్ల పాటుఅడుగులు ముందుకేస్తే తప్ప థేమ్స్ నది సుందరీకరణ చెందలేదు. ఆ నది బయోలాజికల్‌గా దుర్మరణం చెందిందని అప్పట్లో శాస్త్రవేత్తలూ ప్రకటించారు. అయినా, కొన్నేండ్ల నుంచి కృషి చేస్తే తప్ప.. అది జీవనదిగా మారలేదు. అయినా కూడా ఆ నదికి ప్రస్తుతం.. కాలుష్యం, ప్లాస్టిక్, పెరుగుతున్న జనాభా వల్ల ప్రమాదం పొంచి ఉందనే సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి, మన మూసీ నదిని జలరాశి చేయాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే, ఇందుకోసం ఒక పక్కా వ్యూహంతో అడుగులు ముందుకేయాలి. నగరాభివృద్ధితో సంబంధమున్న ప్రతిఒక్కర్ని ఈ క్రతువులో భాగస్వామ్యుల్ని చేయాలి. ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, ల్యాండ్ స్కేపింగ్ డిజైనర్లు, ఎన్జీవోలు, జియాలజిస్టులు, డెవలపర్లు, సిటీ డెవలప్మెంట్ సంఘాలు, విషయ నిపుణులు, పర్యావరణవేత్తలు.. ఇలా ప్రతిఒక్కర్ని భాగస్వామ్యులుగా చేర్చాలి. కొన్నేళ్ల పాటు ఒక మహా యజ్ఞంగా చేస్తే తప్ప.. ఈ పని సక్సెస్ కాదనే విషయాన్ని గుర్తించాలి.