నేను సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా వర్క్ చేస్తున్నా. నా భార్య ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్‌లో జాబ్ చేస్తోంది. అబ్బాయేమో మాదాపూర్‌లోని ఒక కాలేజీలో జాయిన్ అవుతాడు. ప్రస్తుతం మియాపూర్‌లో నివసిస్తున్నాను. మాదాపూర్‌కి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. మా ముందున్న ఆప్షన్స్ ఏమిటి? -అభిరాం,మియాపూర్
మాదాపూర్ వంటి కోర్ ఏరియాలో నివసించడం వల్ల కలిగే ప్రయోజనం.. చుట్టుపక్కల గల ఐటీ కంపెనీలకు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. కాకపోతే, ట్రాఫిక్ రద్దీ వల్ల తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదొక్కటే ప్రతికూల సమస్య. ఈ అంశాన్ని పక్కన పెడితే మాదాపూర్‌లో నివసించేవారికి.. ప్రతి ఒక్క సౌకర్యం అందుబాటులో ఉంటుంది. షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, రాత్రివేళలో స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్లు వంటివన్నీ చేరువలోనే ఉంటాయి. అత్యవసరాల్లో ఆస్పత్రుల సమీపంలో ఉంటాయి. మెట్రో స్టేషన్ దగ్గరగా ఉంటుంది. మరి, మాదాపూర్‌లో ఫ్లాట్ కొనాలని భావించేవారికి అందుబాటులో ఉన్న కొన్ని ఆప్షన్స్.. మీ అవగాహన కోసం..
మాదాపూర్ నుంచి జేఎన్‌టీయూ మార్గంలో అరబిందో రియాల్టీ అరబిందో కొహినూర్ అనే ప్రాజెక్టులను నిర్మిస్తోంది. 12.3 ఎకరాల్లో వచ్చేవి ఏడు టవర్లు కాగా.. జి ప్లస్ 41 అంతస్తుల ఎత్తులో 2,3,4 డ్యూప్లే ఫ్లాట్లను కడుతోంది. ఆర్కిటెక్చర్‌ల్ బ్యూటీకి, ఆకర్షణీయమైన ల్యాండ్ స్కేపింగ్, మోడ్రన్ ఎమినిటీస్‌కు అరబిందో కొహినూర్ సూపర్ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టులో నివసించేవారు ట్రాఫిక్‌లో ఇబ్బంది పడక తప్పదు. కొహీనూర్ ప్రవేశమార్గం వెనక వైపు ఉండటంతో ఖానామెట్ బస్తీకి చేరువలో ఉన్నామన్న అనుభూతి.. హోమ్ బయ్యర్లకు కలిగే అవకాశముంది.
వాసవి సంస్థ మాదాపూర్‌లోని హైటెక్స్ చేరువలో వాసవి స్కైలా ప్రాజెక్టును 6.23 ఎకరాల్లో నిర్మిస్తోంది. ఇందులో వచ్చే ఐదు టవర్లలో 685 ఫ్లాట్లు వస్తాయి. ఒక్కో టవర్ ఎత్తు 32 అంతస్తులు కాగా.. ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికి వస్తే.. 2100 నుంచి 7200 చదరపు అడుగుల్లో డిజైన్ చేశారు. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్రీ బెడ్రూం నుంచి స్కై విల్లాల వరకూ ఇందులో అందుబాటులో ఉన్నాయి.
హైటెక్స్ చేరువలో శ్రీముఖ్ నమితా 360 లైఫ్ ప్రాజెక్టు మూడు ఎకరాల్లో నిర్మాణం జరుగుతోంది. మొదటి ఫేజులో ఒక్క టవర్‌ను.. ముప్పయ్ అంతస్తుల ఎత్తులో 288 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఫ్లాట్ల సైజు విషయానికి వస్తే 2475 నుంచి 4850 చదరపు అడుగుల దాకా ఉన్నాయి. 35 అంతస్తుల ఎత్తులో నిర్మించే రెండో టవర్‌లో వచ్చేవి 254 ఫ్లాట్లు. ఫ్లాట్ల సైజు విషయానికొస్తే 2700 నుంచి 3600 చదరపు అడుగుల్లో డిజైన్ చేశారు. ఒకే ఒక ప్రతికూలత.. ప్రస్తుతం రోడ్డు వెడల్పు చేయకపోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.
ట్రెండ్‌సెట్ జయభేరి ఎలివేట్ అనే ప్రాజెక్టును మాదాపూర్ మెయిన్ రోడ్డులో నిర్మితమవుతోంది. ఏడు ఎకరాల్లో ఆరు బ్లాకుల్ని నిర్మిస్తుండగా.. వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య 526. హైఎండ్ త్రీ మరియు ఫోర్ బీహెచ్‌కే ఫ్లాట్లను ఇందులో డిజైన్ చేశారు. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే 1855 నుంచి 4110 చదరపు అడుగుల విస్తీర్ణంలో తీర్చిదిద్దారు. ప్రతికూలత.. ప్రాజెక్టు లోనికి వెళ్లే ముందు కుడివైపున పాత శ్మశాన వాటిక ఉంది.
బీఎస్‌సీపీఎల్ బొల్లినేని బయాన్ ప్రాజెక్టు కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ ఎదురుగా సుమారు 8.9 ఎకరాల్లో నిర్మాణం జరుగుతోంది. ఇందులో వచ్చేవి ఐదు టవర్లు.. 886 ఫ్లాట్లు. ఫ్లాట్ సైజుల విషయానికి వస్తే.. 1840 నుంచి 3350 చదరపు అడుగుల్లో ఉన్నాయి. తుది రేటు మరియు ఫ్లాట్ల లభ్యత గురించి సంస్థను సంప్రదించండి. ఎదురుగా బొటానికల్ గార్డెన్, పక్కనే షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ ఉండటం అనుకూలత కాగా.. ఈ ఏరియాలో నిత్యం ట్రాఫిక్‌జామ్‌లు ఉండటమే ప్రతికూలత అని చెప్పొచ్చు.
పైన పేర్కొన్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు మాదాపూర్ చుట్టుపక్కల అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. కేవలం కొత్త నిర్మాణాలే కాకుండా.. పలు పాత గేటెడ్ కమ్యూనిటీల్లోనూ అన్నివిధాల నప్పే ఫ్లాట్లు మీకు లభించొచ్చు. మై హోమ్ నవద్వీప, ఆదిత్యా సన్‌షైన్, విష్ణు విస్తారా, ఫార్చ్యూన్ టవర్స్ వంటి వాటిని మీరు చూడొచ్చు.