వారం క్రితం భువనతేజ సంస్థ డైరెక్టర్ చక్కా వెంకటసుబ్రమణ్యంను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, పోలీసుల ప్రాథమిక విచారణలో.. సుమారు నాలుగు వందల మంది సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం నుంచి.. రూ.300 కోట్ల దాకా వసూలు చేశారని తేలిందని సమాచారం. అయితే, ఈ సంఖ్య మరింత పెరిగేందుకు అవకాశముంది. కాకపోతే, ఇన్ని కోట్ల రూపాయల్ని అమాయకుల నుంచి వసూలు చేసి.. ఆ సొమ్మంత ఎక్కడ దాచిపెట్టాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే విషయం గురించి పలువురు బాధితులు రియల్ ఎస్టేట్ గురుకు కొంత సమాచారాన్ని అందించారు. బయ్యర్ల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని చక్కా వెంకటసుబ్రమణ్యం బినామీల పేరిట ఆస్తుల్ని కొన్నారని బయ్యర్లు భావిస్తున్నారు. ఆ బినామీలు మరెవరో కాదు.. సంజయ్, ఫణి భూషణ్రావులేనని కొనుగోలుదారులు అంటున్నారు. కాబట్టి, పోలీసులు ఈ కోణంలో కూడా విచారించి.. తాము కట్టిన సొమ్మును వెనక్కి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
కీమోకు వచ్చి క్యాష్ కట్టాం..
మంచిర్యాలలో సింగరేణీలో ఉద్యోగం చేసిన పలువురు వ్యక్తులు భువనతేజలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. రెండు వేల చదరపు అడుగుల ఫ్లాట్ కేవలం నలభై లక్షలకే వస్తుందని ఏజెంట్ చెబితే.. ముందస్తుగా హండ్రెడ్ పర్సంట్ సొమ్ము చెల్లించి.. ఫ్లాట్ కొన్నవారున్నారు. ఇందులో ఒక వ్యక్తి క్యాన్సర్ పేషేంట్ ఉండటం గమనార్హం. తను బసవతారకం ఆస్పత్రికి కిమోథెరపికి వచ్చి.. ఫ్లాట్ కోసం నలభై లక్షలు చెల్లించామని ఒక బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
- తక్కువలో ఫ్లాటు వస్తుందని చెప్పి.. ఒక మహిళ భర్తకు తెలియకుండా.. అప్పు తెచ్చి మరీ ఫ్లాటును కొనుగోలు చేసి అడ్డంగా మోసపోయారు. ఒక చిన్న కంప్యూటర్ షాపు పెట్టుకున్న వ్యక్తి .. కొన్నేళ్ల నుంచి కష్టపడి సంపాదించిన సొమ్మును తెచ్చి భువనతేజలో పెట్టి దారుణంగా మోసపోయాడు.
- మరో వ్యక్తి మిలట్రీలో పని చేయగా వచ్చిన సొమ్మును తెచ్చి ఈ సంస్థ చేతిలో పోశాడు. ఇప్పుడేమవుతుందో తెలియక నెత్తీనోరు కొట్టుకుంటున్నాడు. పదవీవిరమణ చేసిన తర్వాత వచ్చి బెనిఫిట్స్‌ను తెచ్చి ఈ చక్కా వెంకటసుబ్రమణ్యం చేతిలో పోసి దారుణంగా మోసిపోయాడో వృద్ధుడు.
ఇలా చెప్పుకుంటూ పోతే, దాదాపు నాలుగు వందల మంది కొనుగోలుదారులది ఒక్కో గాథ అని చెప్పొచ్చు. అందుకే, ఇలాంటి మధ్యతరగతి ప్రజానీకాన్ని దారుణంగా మోసం చేసిన భువనతేజ సంస్థ నుంచి తమకు ఎలాగైనా సొమ్ము ఇప్పించాలని ఇళ్ల కొనుగోలుదారులు కోరుతున్నారు.