poulomi avante poulomi avante

111 జీవో అక్ర‌మ విల్లాల‌పై కాంగ్రెస్ వైఖ‌రి మారిందా?

111 జీవో ఎత్తేసినందుకు గ‌తంలో
విరుచుకుప‌డ్డ రేవంత్‌రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, సోమేష్ కుమార్‌,
అర‌వింద్ కుమార్ల‌ను రాళ్ల‌తో కొట్టాల‌న్నారు

ఇప్పుడు అక్ర‌మ నిర్మాణాల‌పై కాంగ్రెస్
ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేదు?

క‌ళ్ల ముందే విల్లాల్ని క‌డుతుంటే
ఎందుకు ప‌ట్టించుకోవ‌ట్లేదు?

వాటిపై చ‌ర్య‌లెందుకు తీసుకోవ‌ట్లేదు?

ట్రిపుల్ వ‌న్ జీవోను ఎత్తివేసిన నేరానికి గాను.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌, సీఎస్ సోమేష్ కుమార్‌, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్లను.. అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద గుంజ‌కు క‌ట్టేసి.. రాళ్ల‌తో కొట్టి చంపినా పాపం లేద‌ని.. తొమ్మిది నెల‌ల క్రితం తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడి హోదాలో రేవంత్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. గ‌ల్ఫ్ కంట్రీస్‌లో దోపిడికి పాల్ప‌డిన‌వారిని రోడ్డు మీద క‌ట్టేసి రాళ్ల‌తో కొట్టి చంపేస్తార‌ని పుస్త‌కాల్లో చ‌దివామ‌ని అప్ప‌ట్లో అన్నారు. ట్రిపుల్ వ‌న్‌ జీవోను ఎత్తివేస్తే భ‌విష్య‌త్తు త‌రాలు బ‌త‌క‌వ‌ని.. క‌ళ్ల ముందే ఇంత పెద్ద విధ్వంసం జ‌రుగుతుంటే.. మ‌న పిల్ల‌లు.. వారి పిల్ల‌లు మొహం మీద ఉమ్మివేస్తార‌ని రేవంత్ విమ‌ర్శించారు. అందుకే, ట్రిపుల్ వ‌న్ జీవో అక్ర‌మ నిర్మాణాల‌పై సీఎం రేవంత్ రెడ్డి కఠిన‌మైన చర్య‌ల్ని తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. గ‌త బీఆర్ఎస్ నాయ‌కుల అండ‌దండ‌ల‌తో ఏడాది క్రితం నుంచి క‌డుతున్న అక్ర‌మ విల్లాల‌ను నేల‌మ‌ట్టం చేయాలని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు కోరుతున్నారు.

అప్పుడంటే సీఎం కేసీఆర్.. యువ‌మంత్రి కేటీఆర్‌.. వాళ్లు ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌గా సాగింది. ట్రిపుల్ వ‌న్ జీవోలో మూడో పేరాను మార్చివేసి 69 జీవోను తీసుకొచ్చారు. మ‌రి, అప్ప‌ట్నుంచి ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతాల్లో అధికారికంగా ఎన్ని నిర్మాణాల‌కు హెచ్ఎండీఏ అనుమ‌తుల్ని మంజూరు చేసిందో.. ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డి వెలికి తీయాలి. అందుకు స‌హ‌క‌రించిందెవ‌రో క‌నుక్కోవాలి. ఎక్క‌డెక్క‌డ ఏయే బిల్డ‌ర్లు అక్ర‌మ‌రీతిలో విల్లాల్ని నిర్మిస్తున్నారో తెలుసుకోవాలి. హైద‌రాబాద్ ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌ర‌ర‌క్షించే క్ర‌మంలో వాటిని పూర్తిగా నేల‌మ‌ట్టం చేయాలి.

అక్ర‌మ విల్లాల్ని కూల్చివేస్తారా?

న‌లుగురు వ్య‌క్తుల ధ‌నదాహం కోసం ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తివేత అనేది దుర్మార్గ‌మైన నిర్ణ‌య‌మ‌ని అప్ప‌ట్లో రేవంత్‌రెడ్డి విరుచుకు ప‌డ్డారు. వికారాబాద్‌, ఆపై ప్రాంతాల్లో కురిసే వ‌ర్షం వ‌ల్ల జంట జ‌లాశ‌యాలు నిండుతాయ‌న్నారు. ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తివేస్తే.. హైద‌రాబాద్‌ను ర‌క్షించే మెకానిజ‌మే లేదు. ట్రిపుల్ వ‌న్ జీవోను ఎత్తివేస్తే.. హైద‌రాబాద్ న‌గ‌రం వ‌ర‌ద‌ల్లో మునిగి.. వేల‌మంది మ‌ర‌ణించి.. ఇక్క‌డి నిర్మాణాల‌న్నీ విధ్వంస‌మ‌య్యే ప‌రిస్థితి దాపురిస్తుంద‌ని అప్ప‌ట్లో రేవంత్ రెడ్డి అన్నారు. త‌క్ష‌ణ‌మే ఈ విధ్వంసాన్ని ఆపాల‌ని ఆయ‌న అప్ప‌ట్లో సూచించారు.
ప్ర‌స్తుతం సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు కాబ‌ట్టి, ట్రిపుల్ వ‌న్ జీవోలోని అక్ర‌మ నిర్మాణాల్ని కూల్చివేస్తారా? రాత్రికి రాత్రే నిర్మిస్తున్న విల్లాల‌ను నిర్మిస్తున్న బిల్డ‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌ల్ని ఎందుకు తీసుకోవ‌ట్లేదు? గ‌తంలో అంటే సీఎంగా కేసీఆర్ ఉన్నారు.. కానీ, ప్ర‌స్తుతం ఆ ప‌ద‌విలో రేవంత్ రెడ్డి ఉన్నారు కాబ‌ట్టి, హైద‌రాబాద్‌ను పూర్తి స్థాయిలో ర‌క్షించే బాధ్య‌త ఆయ‌న‌దేన‌ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles