ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో ఫేజు ప్రణాళికలు ఖరారైంది. ఇందుకోసం కొత్త రూటు మాపు తయారైంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా కొత్త రూట్ డిజైన్ చేశారు. హైదరాబాద్లోని అన్ని రూట్లలో కనెక్టివిటీ పెంచడం ద్వారా సామాన్యుల నుంచి సామాన్యుల వరకు మెట్రో రైలు సేవలను అందరికీ అందుబాటులో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్ బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. ఫేజ్ 2 విస్తరణలో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రెండో కారిడార్ ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగిస్తారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైలు రూట్ నిర్మాణం చేపడతారు.
కొత్త రూట్ మ్యాప్ ఇలా..
కారిడార్ 2: ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్ నుమా వరకు (5.5 కిలోమీటర్లు)
కారిడార్ 2: ఫలక్ నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు (1.5 కిలోమీటర్లు)
కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కణ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్ దేవ్ పల్లి, పీ 7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (మొత్తం 29 కిలోమీటర్లు)
కారిడార్ 4: మైలార్ దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్ లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు (4 కిలోమీటర్లు)
కారిడార్ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్) వరకు (8 కిలోమీటర్లు)
కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరు వరకు (14 కిలోమీటర్లు)
కారిడార్ 7: ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కిలోమీటర్లు)