ముందునుంచీ బయ్యర్లను
హెచ్చరిస్తున్న రెజ్‌న్యూస్..
ఆర్‌జే గ్రూప్‌లో కొనొద్దని 2021లోనే
చెప్పిన రియల్ ఎస్టేట్ గురు..
అయినా పట్టించుకోని బయ్యర్లు
ఇప్పుడేమో మోసపోయామంటూ ఆందోళన
చేతులు కాలిన తర్వాత ఆకుల్ని
పట్టుకుంటే ఏం లాభం?
ఆర్జే గ్రూప్ మోసపూరిత సంస్థ అని.. రెరా అనుమతి లేకుండా.. ఘట్‌కేసర్ వంటి ప్రాంతాల్లో ప్రీలాంచ్‌లు చేస్తున్నదని.. రెజ్ న్యూస్ 2021లోనే వెలుగులోకి తెచ్చింది. ఆ సంస్థ ఆరంభించిన ప్రీలాంచుల్లో కొంటే మోసపోతారని.. హెచ్ఎండీఏ అనుమతి రాకపోతే.. అందులో కొన్నవారు మునిగిపోతారని హెచ్చరించింది. కాకపోతే, అప్పటి రెరా అధికారులు పకడ్బందీగా వ్యవహరించకపోవడంతో.. ఆర్జే గ్రూప్ ప్రీలాంచ్ వ్యాపారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించింది. తాజాగా, ఇందులో బయ్యర్లు బషీర్‌బాగ్ సీసీఎల్ పోలీసు కార్యాలయానికి చేరి.. తాము మోసపోయామంటూ ఫిర్యాదు చేశారు. రెజ్ న్యూస్ చెప్పిన మాట అప్పుడే విని ఉంటే.. నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా..!
రెజ్ న్యూస్ అనుకున్నట్టే జరిగింది. ఆర్‌జే గ్రూప్ అనే సంస్థ సుమారు 600 మంది ప్రజల నెత్తిమీద శఠగోపం పెట్టింది. దాదాపు రూ.150 కోట్లను వసూలు చేసింది. నారాయణ్ ఖేడ్, ఘట్‌కేసర్, పఠాన్ చెరు, కర్దనూరు వంటి ప్రాంతాల్లో.. అపార్ట్మెంట్, ఫార్మ్ ల్యాండ్ పేరిట వెంచర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పలు ప్రముఖులతో ప్రకటనల్ని కూడా చేయించిందని బాధితులు పేర్కొన్నారు. 2022 నుంచి ఈ సంస్థలో ఒక్కొక్కరు 20 నుంచి 50 లక్షలు పెట్టుబడి పెట్టామని తెలిపారు. నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకూ నిర్మాణం చేపట్టలేదు. ఆర్‌జే గ్రూప్ ఎండీ భాస్కర్ గుప్త, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి మోసపోయామని బాధాతులు వాపోయారు. తాము వీరిని గట్టిగా నిలదీస్తే.. చెక్కులు ఇచ్చారు.. కానీ, అవి కూడా బౌన్స్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉండటంతో అక్కడికెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆర్జే గ్రూప్ ఆస్తుల్ని అమ్మి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.