poulomi avante poulomi avante

డ్రీమ్‌వ్యాలీ అక్ర‌మ‌ నిర్మాణాలు నిజ‌మే!

  • రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌కు స్ప‌ష్టం చేసిన‌
  • బాకారం గ్రామ కార్య‌ద‌ర్శి
  • నోటీసులిచ్చినా ప‌ట్టించుకోకుండా
  • అక్ర‌మ నిర్మాణాల్ని క‌డుతున్న డ్రీమ్ వ్యాలీ

మొయినాబాద్ మండ‌లంలోని బాకారంలో డ్రీమ్ వ్యాలీ అక్ర‌మంగా విల్లాల‌ను నిర్మించిన మాట వాస్త‌వ‌మేన‌ని బాకారం గ్రామ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌కు స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల ఆయ‌న కలెక్ట‌ర్‌కు ఇచ్చిన నివేదిక‌లో డ్రీమ్ వ్యాలీకి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు..

2024 జ‌న‌వ‌రి 30న తాను విధుల్లోకి హాజ‌ర‌య్యే నాటికీ డ్రీమ్ విల్లాలో ఇళ్ల నిర్మాణ ప‌నులు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయ‌ని నివేదిక‌లో పేర్కొన్నారు. కాక‌పోతే, అంత‌కు ముందే అప్ప‌టి పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి డ్రీమ్ వ్యాలీకి నోటీసులిచ్చార‌ని గుర్తు చేశారు. అయితే, హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ తాజాగా ఇచ్చిన ఆదేశాల మేర‌కు డ్రీమ్ వ్యాలీ రిసార్టు ప్రాంతాన్ని పూర్తిగా త‌నిఖీ చేశామ‌ని.. అయితే అప్ప‌టికే ప‌ద‌కొండు విల్లాల నిర్మాణం పూర్త‌య్యింద‌ని.. రెండు మాత్రం నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయ‌ని తెలిపారు. ఈ అంశాన్ని గుర్తించి ఫిబ్ర‌వ‌రి 23న.. డ్రీమ్ వ్యాలీకి చెందిన‌ కే. ఆకాష్ రెడ్డి, న‌రేంద‌ర్ గౌరీ, అషు గౌరీ, హీనా మెండిరెట్టా, మేడా ర‌మ‌ణ‌, న‌ల‌మ‌ద అప‌ర్ణాల‌కు నోటీసుల‌ను జారీ చేశామ‌ని తెలిపారు. అయితే, దానికి వారు స్పందిస్తూ.. తాము 2022 నవంబ‌రు 30న తెలంగాణ పంచాయ‌తీ రాజ్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 114 ప్ర‌కారం బిల్డింగ్ ప‌ర్మిష‌న్‌కు అనుమ‌తిని కోరుతూ ద‌ర‌ఖాస్తు చేశామ‌ని స‌మాధాన‌మిచ్చారు. కాక‌పోతే, అనుమ‌తిని మంజూరు చేశారా? లేదా తిర‌స్క‌రించారా? అనే అంశంపై త‌మ‌కు స‌మాచారం అంద‌లేద‌ని.. అందుకే, డీమ్డ్ అప్రూవ‌ల్‌గా భావించి నిర్మాణాల్ని చేప‌ట్టామ‌ని జ‌వాబునిచ్చారు. కాక‌పోతే, అప్ప‌టి పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ 2022 డిసెంబ‌రు 3న‌, బాకారం ట్రిపుల్ వ‌న్ జీవో ప‌రిధిలోకి వ‌స్తుందంటూ స‌మాధానం ఇచ్చాడ‌ని తెలియ‌జేస్తూ అందుకు సంబంధించిన లెట‌ర్‌ను కూడా ప్ర‌స్తుత గ్రామ కార్య‌ద‌ర్శి జ‌త చేశారు.

మొత్తానికి, బాకారం ట్రిపుల్ వ‌న్ జీవో ప‌రిధిలోకి వ‌స్తుంది కాబ‌ట్టి.. క్యాచ్‌మెంట్ ఏరియాలో నిర్మాణ కార్య‌క‌లాపాలు చేప‌డితే ప‌ర్యావ‌ర‌ణానికి విఘాతం క‌లుగుతుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు ప‌ట్టాదారుల‌కు నోటీసులిచ్చినా ప‌ట్టించుకోకుండా నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని క‌లెక్ట‌ర్ దృష్టికి తెచ్చారు. అయితే, వాటిని కూల్చివేయ‌డానికి త‌మ వ‌ద్ద ఎన్ఫోర్స్‌మెంట్ బృందంతో పాటు అందుకు సంబంధించిన యంత్ర‌ప‌రికరాలు లేవ‌న్నారు. ఇదే విష‌యాన్ని శంక‌ర్‌ప‌ల్లి హెచ్ఎండీఏ ప్లానింగ్ ఆఫీస‌ర్‌కు వివ‌రిస్తూ త‌దుప‌రి చ‌ర్య‌ల్ని తీసుకోవాల‌ని కోరామని తెలిపారు. ఈ వాస్త‌వాల్ని దృష్టిలో పెట్టుకుని డ్రీమ్ వ్యాలీ అక్ర‌మంగా నిర్మిస్తున్న నిర్మాణాల్ని కూల్చివేయ‌డానికి త‌గిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాన్ని పంపాల‌ని హెచ్ఎండీఏకు విన్న‌వించాల‌ని బాకారం పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌ను కోరారు.

గ‌త బీఆర్ఎస్ పాల‌న త‌ర‌హాలోనే.. రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ ఈసారి కూడా ఎలాంటి చ‌ర్య‌ల్ని తీసుకోకుండా వ‌దిలేస్తారా? ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల్ని హెచ్ఎండీఏ పంప‌కుండా నిలిచిపోతుందా? అనే అంశం త్వ‌ర‌లో తేలుతుంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ట్రిపుల్ వ‌న్ జీవో ర‌ద్దుపై వ్య‌తిరేకంగా ఉన్న విష‌యం తెలిసిందే. ప‌ర్యావ‌ర‌ణ పరిర‌క్ష‌ణే త‌మ ప్ర‌థ‌మ క‌ర్తవ్య‌మ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా చెప్పారు. అందుకే, డ్రీమ్ వ్యాలీ నిర్మిస్తున్న‌ అక్ర‌మ విల్లాల్లి ఎట్టి ప‌రిస్థితిలో కూల్చివేయాల‌ని స్థానికులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles