మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భూ సమస్యలకు శరఘాతంగా మారిన ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో ధరణి పునర్నిర్మాణం కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనపై ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎలాంటి ఆధ్యయనం చేయకుండా.. ఎంతో హడావిడిగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఏదో ఒక కుటుంబం ధరణితో సమస్యలను ఎదుర్కొంటుందని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2,46,536 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. వీటి పరిష్కారానికి మార్చి 1వ తేది నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 50 శాతం దరఖాస్తుల్ని పరిష్కరించామన్నారు. మిగిలిన దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.
రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం చౌటుప్పల్, ఆమన్ గల్, షాద్ నగర్, సంగారెడ్డిలపై 1082 కిలోమీటర్ల జాతీయ రహదారికి మోక్షం లభించిందని వెల్లడించారు. రాజీవ్ రహదారిపై దీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఎక్స్ ప్రెస్ కారిడార్ కి, పాతబస్తీకి కొత్త అందాలు తెచ్చే మెట్రోరైలు ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేయడం వంటి కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు.