భువనతేజ ఇన్ఫ్రా ఎండీ చక్కా వెంకట సుబ్రమణ్యం అరెస్టైన నెల రోజులకే ఉప్పల్‌లో మరో రియల్ సంస్థ బిచాణా ఎత్తేసింది. సుమారు ఏడు వేల మంది కస్టమర్ల నుంచి దాదాపు రూ.500 కోట్ల దాకా వసూలు చేసిన యజమానులు వి. లక్ష్మీనారాయణ, జ్యోతిలు రాత్రికి రాత్రే ఉడాయించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు.. ఉప్పల్ పోలీసు స్టేషన్‌కు చేరి..తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సామాన్య, మధ్యతరగతి ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకున్న జేవీ బిల్డర్స్ సంస్థ.. తమ వద్ద పెట్టుబడి పెడితే అధిక వడ్డీ చెల్లిస్తామని ఆశపెట్టారు. లక్ష కడితే నెలకు రూ.14 వేల వడ్డీ, పది లక్షలు కడితే ప్రతి పదిహేను రోజులకోసారి 20 వేల వడ్డీ, లక్ష చొప్పున సొమ్ము ఇస్తామంటూ కోట్ల రూపాయల్ని దండుకున్నారు. పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేందుకు కొన్ని ప్రాంతాల్లో భూముల్ని సైతం రిజిస్ట్రేషన్ చేశారు. బాధితుల వివరాల ప్రకారం.. గతంలో నారాయణ్‌ఖేడ్, కల్వకుర్తిలో వీరు రీగల్ ఎస్టేట్ పేరుతో సంస్థను ఆరంభించి క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో అధిక సొమ్మును వసూలు చేసింది. ఈ సంస్థ సుమారు 500 మంది ఏజెంట్లను రిక్రూట్ చేసుకుందని సమాచారం.
రూ.500 కోట్లు వసూలు చేసి.. బిచాణా ఎత్తేసిన జేవీ బిల్డర్స్..
JV Builders Cheated Rs. 500 Crores