అమాయక ప్రజల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల్ని వసూలు చేసి బిచాణా ఎత్తేసిన జేవీ బిల్డర్స్ యజమానులకు.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్‌కు.. అవినాభావ సంబంధం ఉందంటూ కొందరు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, రెండేళ్ల క్రితం ఉప్పల్‌లో ఈ సంస్థ ఆఫీసు ప్రారంభోత్సవం సాయికిరణ్ యాదవ్ చేతుల మీదుగా జరిగిందని.. పైగా, తను కంపెనీ ఎండీ సీటులో కూర్చుని.. పలువురు కొనుగోలుదారులతో మాట్లాడటమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే, అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. మంత్రి (ప్రస్తుతం మాజీ) కుమారుడుగా అతను ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడమో కారణమని చెప్పొచ్చు. ఆయన్ని కూడా చూసి ఈ సంస్థలో పెట్టుబడి పెట్టామని పలువురు వాపోతున్నారు. ఈ కంపెనీ బిచాణా ఎత్తేస్తుందని తలసాని సాయి కిరణ్ యాదవ్ కు ముందే తెలుసా? అనే రీతిలో కూడా పోలీసులు లోతైన పరిశోధన చేస్తున్నారని తెలిసింది.
* జేవీ బిల్డర్స్ ఏం చేసిందంటే.. తమ సంస్థలో పెట్టుబడి పెడితే అసలు, లాభంతో పాటు ప్రతినెలా కొంత సొమ్ము వెనక్కి ఇస్తామని ప్రచారం చేసింది. సుమారు లక్ష నుంచి 9 లక్షల వరకూ పెట్టే పెట్టుబడిపై చెక్‌తో పాటు అగ్రిమెంట్ కూడా చేసిస్తామని సంస్థ తెలియజేసింది. ఎవరైనా రూ.10 లక్షల కంటే అధిక పెట్టుబడి పెడితే గుంట స్థలం సెక్యూరిటీగా రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మించింది. అంతేకాదు, ఐదు లక్షలు పెట్టుబడి పెడితే నెలకు 70 వేల చొప్పున పది నెలల పాటు వెనక్కి తిరిగి ఇస్తామని ప్రజల్ని నమ్మించింది. ఇలాంటి ఆకర్షణీయమైన స్కీములకు బోల్తాపడి అధిక శాతం మంది వీరి కంపెనీలో పెట్టుబడి పెట్టి దారుణంగా మోసపోయారు. మరి, ఇందులో మదుపు చేసి దగా పడ్డ వారికి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.