- ఇన్వెస్టర్లకు కొత్త ప్రభుత్వం పూర్తి భరోసా
- ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాం
- 24 గంటలూ అందుబాటులో ఉంటాం
- గ్లోబల్ సిటీగా నగరాన్ని డెవలప్ చేస్తాం
- వచ్చే పదేళ్లలో 7.8 కోట్ల ఇళ్లు కావాలి..
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళతామని.. ఐటీ, ఉత్పత్తి, నిర్మాణ రంగాలకు ఎనలేని ప్రోత్సహాన్నిస్తూ.. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. పెట్టబడుల్ని ఆకర్షించేందుకు స్నేహపూరితమైన వాతావరణాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైటెక్స్‌లో సీఐఐ ఐజీబీసీ సెకండ్ ఎడిషన్ గ్రీన్ ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. గ్లోబల్ సిటీకి కావాల్సిన మౌలిక సదుపాయాల్ని మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో మూసీ రివర్ ఫ్రంట్‌ను డెవలప్ చేసేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. నగరానికి నలువైపులా మెట్రో కారిడార్‌ను విస్తరిస్తామని తెలిపారు. సులభతరమైన వాణిజ్య విధానాన్ని ప్రోత్సహించేందుకు దేశంలోనే తమ ప్రభుత్వం ముందంజలో ఉంటుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నూతనోత్సహాన్ని నింపేందుకు అవసరమయ్యే అన్నిరకాల చర్యల్ని ప్రభుత్వం తీసుకుంటుందని భరోసానిచ్చారు. తమ ప్రభుత్వంలో ప్రతిఒక్కరూ ఇరవై నాలుగూ గంటలు అందుబాటులో ఉంటారని.. ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వచ్చే పదేళ్లలో క్రెడిట్ కార్డు తరహాలో కార్బన్ క్రెడిట్‌ను ప్రవేశపెట్టే అవకాశముందని.. అందులో నెగటివ్ పాయింట్లు వస్తే బిల్డర్లకు ఎలాంటి రుణాలు మంజూరు కావని తెలిపారు. కాబట్టి, బిల్డర్లందరూ పర్యావరణ అనుకూలమైన నిర్మాణాల్ని చేపట్టాలని సూచించారు. 2070 కార్బన్ రహిత దేశంగా మనం ఖ్యాతినార్జిస్తామనే నమ్మకం ఉందన్నారు. 2003లో ఐజీబీసీ హైదరాబాద్లో ఆరంభమైందని.. అప్పట్నుంచి హరిత భవనాల ఏర్పాటులో ఐజీబీసీ క్రియాశీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.
లక్ష కోట్ల విలువ గల
గ్రీన్ భవనాల నిర్మాణం
తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎనిమిది వందల హరిత ప్రాజెక్టులు.. 1.4 బిలియన్ చదరపు అడుగుల్లో నిర్మాణం జరుగుతున్నాయని.. వీటి విలువ ఎంతలేదన్నారూ.లక్ష కోట్ల దాకా ఉంటుందని ఐజీబీసీ నేషనల్ వైస్ ఛైర్మన్ సి.శేఖర్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం హైటెక్స్‌లో మొదలైన సెకండ్ ఎడిషన్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో ఆయన మాట్లాడుతూ.. సుమారు డెబ్బయ్ మంది బిల్డర్లు కలిసి హైదరాబాద్‌లో డెబ్బయ్ వేల హరిత అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారని.. వీటి విస్తీర్ణం ఎంతలేదన్నా పదహారు నుంచి పదిహేను కోట్ల దాకా ఉంటుందన్నారు. ఇవి ఆరు నెలల్నుంచి నాలుగేళ్లలోపు ఇవి పూర్తవుతాయని తెలిపారు. దేశవ్యాప్తంగా చూస్తే 13 వేల హరిత ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని.. ప్రపంచ గ్రీన్ బిల్డింగుల్లో మనం రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. గ్రీన్ బిల్డింగులను నిర్మించేందుకు అవసరమయ్యేలా సుమారు 8,300 హరిత వస్తువులున్నాయని అన్నారు. ఐజీబీసీ ప్రీ సర్టిఫైడ్ నిర్మాణాల్ని మాత్రమే ఈ ప్రాపర్టీ షోలో ప్రదర్శిస్తున్నామని తెలిపారు.
గ్లోబల్ సస్టెయినబుల్ సిటీ..
దేశంలోని ప్రతిఒక్కరికి సస్టెయినబిలిటీ గురించి అవగాహన పెరగాల్సిన ఆవశ్యకత ఉందని సి.శేఖర్ రెడ్డి అన్నారు. హరిత భవనాల్లో నివసించడం వల్ల కలిగే లాభాల గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. గాలీ, వెలుతురు ధారాళంగా వస్తుందని.. విద్యుత్తు వినియోగం కూడా తగ్గుతుందనే విషయం అందరికి తెలియాలన్నారు. గ్లోబల్ సస్టెయినబిల్ సిటీగా హైదరాబాద్ అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.. అప్పుడే మనం ప్రపంచ పెట్టుబడుల్ని ఆకర్షించగల్గుతామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాల్లో స్థిరపడిన వారిని స్వదేశానికి వచ్చి పరిశ్రమల్ని పెట్టేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ విభాగంలో ఒక ప్రత్యేక పోర్ట్‌ఫోలియో పెడితే.. రివర్స్ మైగ్రేషన్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపారు.
7.8 కోట్ల ఇళ్లు కావాలి..
ఐటీ, ఉత్పత్తి వంటి రంగాలు వృద్ధి చెందితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుతుందని.. వీటి బైప్రాడక్టే రియాల్టీ రంగంగా అభివర్ణించారు. గత రెండు దశాబ్దాల్లో.. వేగంగా అభివృద్ధి చెందే నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉందని వెల్లడించారు. రానున్న పదేళ్లలో 7.8 కోట్ల ఇళ్ల అవసరముందని పలు నివేదికలు వెల్లడించాయని తెలిపారు. ప్రభుత్వం కొత్త పాలసీలు, నూతన స్కీముల్ని ప్రకటించినప్పుడే రియాల్టీ మార్కెట్ సానుకూలంగా స్పందిస్తుందనే విషయాన్ని గుర్తు చేశారు. సులభతరమైన వాణిజ్య విధానాన్ని అమలు చేయడం, పన్నుల హేతుబద్ధత వంటివి ప్రవేశపెట్టినప్పుడు రియల్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. కోవిడ్ తర్వాత అధిక విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్లకు గిరాకీ పెరుగుతుందని చెప్పారు. దేశంలోనే ఎక్కువ ఆకాశహర్మ్యాల నిర్మాణం హైదరాబాద్‌లో జరుగుతున్నాయని.. సెవెన్ స్టార్ క్లబ్ హౌస్ సదుపాయాల్ని బిల్డర్లు అందజేస్తున్నారని తెలిపారు.