హైదరాబాద్ మెట్రొపాలిటన్ వాటరీ సీవరేజ్ బోర్డు సమగ్ర మురుగునీటి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే ప్రక్రియలో ఉంది. 2051 నాటికి దాదాపు 2.56 కోట్ల మంది జనాభాతో 3716 ఎంఎల్ డీ మురుగునీరు ఉత్తత్తి అవుతుందని అంచనా. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 1650 ఎంఎల్ డీ మురుగు నీరు ఉత్పత్తి అవుతుండగా 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్ డీ శుద్ధి అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంతరాన్ని తగ్గిండానికి వాటర్ సీవరేజ్ బోర్డు రూ. 3866 కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్ డీ సామర్థ్యంతో మరో 31 ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించింది.
ప్యాకేజీ-1 : మూసీ క్యాచ్ మెంట్ కు ఉత్తరాన ఉప్పల్, కాప్రా, మల్కాజ్ గిరి, అల్వాల్ ను కవర్ చేసేందుకు రూ.1230.21 కోట్ల ఖర్చుతో 8 ఎస్టీపీలు నిర్మిస్తున్నారు. రెండు ఎస్టీపీలు పూర్తికాగా, మూడు ఎస్టీపీల పనులు జరుగుతున్నాయి. మరో మూడు ఎస్టీపీలు అమృత్-2.0 కింద ప్రతిపాదించారు.
ప్యాకేజీ-2 : మూసీ క్యాచ్ మెంట్ కు దక్షిణాన రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ సర్కిళ్లను కవర్ చేసేలా 6 ఎస్టీపీలు చేపట్టారు. రెండు ఎస్టీపీలు పూర్తి కాగా, మరో మూడు పురోగతిలో ఉన్నాయి.
ప్యాకేజీ-3 : హుస్సేన్ సాగర్ లేక్ క్యాచ్ మెంట్ కింద కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలిగంపల్లి సర్కిళ్లను కవర్ చేసేలా 14 ఎస్టీపీలు నిర్మిస్తున్నారు. ఒకటి ప్రారంభం కాగా, తొమ్మిది పురోగతిలో ఉన్నాయి. మరో నాలుగు అమృత్-2.0 కింద ప్రతిపాదించారు.
మొత్తమ్మీద మూసీ రివర్ బ్యాంక్ లోని ఎస్టీపీల మొత్తం సామర్థ్యం 1338 ఎంఎల్ డీ కావడం గమనార్హం. 2024 జూలై నాటికి కొత్త ఎస్టీపీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి 100 శాతం మురుగునీటి శుద్ధి సౌకర్యం వచ్చినట్టే అవుతుంది. అలాగే సమగ్ర మురుగునీటి మాస్టర్ ప్లాన్ లో భాగంగా 1259.50 ఎంఎల్ డీ సామర్థ్యం లిగిన 27 ఎస్టీపీలు అవసరమవుతాయి. మరోవైపు జీహెచ్ఎంసీ ప్రాంతం కోసం కోర్ సిటీ, పెరిఫెరల్ సర్కిళ్ల కోసం మొత్తం రూ.3723 కోట్లతో మురుగునీటి నెట్ వర్క్ మెరుగుదలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. అలాగే ఓఆర్ఆర్ ప్రాంతంలో రూ.3784.99 కోట్ల వ్యయంతో 965 ఎంఎల్ డీ సామర్థ్యం కలిగిన 38 ఎస్టీపీలు, రూ. 64.11 కోట్ల వ్యయంతో 7 ఎంఎల్ డీ సామర్థ్యం కలిగిన ఒక ఎస్టీపీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.