2020 సెప్టెంబరు నుంచి 2021 మార్చి దాకా స్టాంపు డ్యూటీని తగ్గించడం వల్ల ముంబై, పుణె నగరాల్లో నిర్మాణ రంగానికి గణనీయమైన గిరాకీ పెరిగిందని నిరంజన్ హీరానందానీ అభిప్రాయపడ్డారు. హౌసింగ్ డాట్కామ్ హీరానందానీ సంస్థలు కలిసి నిర్వహించిన తాజా సర్వే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ వల్ల సొంతిల్లు కొనుక్కోవాలనే ఆలోచన మాత్రం కొనుగోలుదారుల్లో పెరిగిందన్నారు. ఇంటీగ్రేటెడ్ టౌన్ షిప్పుల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే.. ప్రాంగణంలోనే ఉండే ఆఫీసులకు సులువుగా రాకపోకల్ని సాగించవచ్చని తెలిపారు. రానున్న పండగల సీజన్, తగ్గిన వడ్డీ రేట్లు, పెరుగుతున్న ఉపాధి రేటు, విదేశీ మారకద్రవ్యం, ఎఫ్ డీఐలు వంటి వాటి వల్ల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుందన్నారు. జీఎస్టీ రేటు తగ్గుదల, ఆదాయ పన్ను ప్రయోజనాన్ని కలిగిస్తే రియల్ రంగానికి స్థిరమైన డిమాండ్ ని ఏర్పాటు చేస్తాయన్నారు.
# ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 43 శాతం మంది స్టాక్ మార్కెట్ కంటే రియల్ ఎస్టేట్లో మదుపు చేయడమే సరైన నిర్ణయమని అన్నారు. సొమ్ము చెల్లింపులో సులభ విధానం, రాయితీలిస్తే సొంతింటి ఎంపికకు ముందుకొస్తామని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా హౌసింగ్ డాట్కామ్ సీవోవో మణి రంగరాజన్ మాట్లాడుతూ.. నిర్మాణ వ్యయం పెరుగుదల, కొన్ని ప్రాంతాల్లో భూముల ధరల వల్ల బిల్డర్ల మార్జిన్లు తగ్గిపోయాయని తెలిపారు. అందుకే, ధరను తగ్గించడానికి కొంత మాత్రమే అవకాశం ఉంటుందన్నారు.