మూడేళ్లలో పట్టాలెక్కనున్న మెట్రో రైల్
హైదరాబాద్ లో రెండో దశ మెట్రో రైల్ విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు వేర్వేరు మార్గాల్లో 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాల నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ఇందుకు సంబంధించిన డీపీఆర్ పనులను వర్కవుట్ చేస్తోంది ప్రభుత్వం. విస్తరణలో భాగంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న కారిడార్-1 కు పొడిగింపు అయిన ఎల్బీనగర్ హయత్‌నగర్ మార్గం పట్టాలెక్కబోతోంది. మొత్తం 7 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్న ఎల్బీ నగర్, హయత్ నగర్ మార్గంలో 6 స్టేషన్లు రానున్నాయి. ఈ మార్గంలో చింతల్ కుంట వద్ద ఒక మెట్రో స్టేషన్ ఏర్పాటుచేయనున్నారు.
ఇప్పటికే చింతల్ కుంట నుంచి హయత్ నగర్ మధ్య నేషనల్ హైవేస్ అథారిటీ ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ఎడమ వైపు సర్వీస్ రోడ్డులో మెట్రో మార్గం రానుందని హైదరబాద్ మెట్రో సంస్థ అధికారులు తెలిపారు. నగర శివారులోని హయత్ నగర్ నుంచి నిత్యం లక్షలాది మంది వేర్వేరు ప్రాంతాలు, ఐటీ కారిడార్ కు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గంలో వాహనాల రద్దీతో గంటల తరబడి ట్రాఫిక్‌లోనే చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్బీనగర్ హయత్ నగర్ కారిడార్ మెట్రో రైలు వీస్తరణతో వారి కష్టాలు తీరనున్నాయి.