జూన్ త్రైమాసికంలో 15 శాతం పెరుగుదల
కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ నివేదికలో వెల్లడి
షాపింగ్ మాల్స్ లో రిటైల్ స్పేస్ కు సూపర్ డిమాండ్ కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రిటైల్ స్పేస్ డిమాండ్ 15 శాతం పెరిగి 6.12 లక్షల చదరపు అడుగులకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఇది 5.33 లక్షల చదరపు అడుగులుగా ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. మొత్తానికి ఈ ఎనిమిది నగరాల్లోని మెయిన్ సెంటర్లలో రిటైల్ స్పేస్ డిమాండ్ గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగి 13.89 లక్షల చదరపు అడుగులుగా ఉందని తెలిపింది. గతేడాది ఇదే కాలంలో ఈ డిమాండ్ 13.31 లక్షల చదరపు అడుగులుగా ఉన్నట్టు పేర్కొంది..
అలాగే హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో అద్దెలు గతేడాది కంటే పెరిగినట్టు వివరించింది. కొత్త మాల్స్ పరిమితంగా ప్రారంభం కావడంతో అధిన వసతులు కలిగిన రిటైల్ స్పేస్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రముఖ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై లీజుకు రిటైలర్లు ప్రాధాన్యమిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. ఏప్రిల్-జూన్ కాలంలో మొత్తం లీజింగ్‌లో 70 శాతం ప్రధాన వీధులకు సంబంధించే ఉన్నట్టు తెలిపింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో అద్దెలు కూడా పెరిగాయని, గ్రేడ్ ఏ విభాగంలో త్వరలో రానున్న 45 లక్షల చదరపు అడుగుల స్పేస్‌తో ఇవి కాస్త స్థిరపడే అవకాశం ఉందని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిటైల్ హెడ్ సౌరభ్ తెలిపారు.