- ప్రీమియం ఇళ్లు, వాణిజ్య కేంద్రాలు, లగ్జరీ హోటల్
- ఒప్పందంపై సంతకాలు చేసిన ఎల్ అండ్ టీ, వేలార్ ఎస్టేట్
ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో భారీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. పదెకరాల స్థలంలో రూ.20వేల కోట్ల ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టడానికి ఎల్ అండ్ టీ రియల్టీ, వేలార్ ఎస్టేట్ (గతంలో డీబీ రియల్టీ) మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు కింద ప్రీమియం ఇళ్లతోపాటు వాణిజ్య కేంద్రాలు, ఓ లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదిన స్థలం కొత్తగా రాబోయే బాంబే హైకోర్టు కాంప్లెక్స్ పక్కనే ఉంది. మొత్తం 7.5 మిలియన్ చదరపు అడుగుల ఏరియా అభివృద్ధి కానుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎల్ అండ్ టీకి 58 శాతం, వేలార్ ఎస్టేట్ కి 42 శాతం వాటా లభిస్తాయి. ప్రతిపాదిత లగ్జరీ ఫైవ్ స్టార్ మాత్రం వేలార్ ఎస్టేట్ కే దక్కుతుంది.
దాదాపు 5500 కుటుంబాలు నివసిస్తున్న మురికివాడలకు చెందిన 13 ఎకరాల స్థలంలో ఈ పదెకరాలు ఉంది. ప్రాజెక్టులో భాగంగా ఆ కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఆ స్థలాన్ని ఖాళీ చేయించడం, ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతులు తీసుకోవడం వంటి బాధ్యతలన్నీ వేలార్ ఎస్టేట్ చూసుకుంటుంది. ఇందుకోసం 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని అంచనా. పునరావాసం కల్పించడంతోపాటు మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయడానికి 5 నుంచి 6 ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ ప్రాజెక్టులో 3.75 మిలియన్ చదరపు అడుగులు అమ్మకానికి, 3.2 మిలియన్ చదరపు అడుగులు పునరావాసానికి కేటాయించారు. అమ్మకానికి కేటాయించిన 3.75 మిలియన్ చదరపు అడుగుల స్థలంలో 1.5 మిలియన్ చదరపు అడుగుల్లో లగ్జరీ హోటల్ నిర్మిస్తారు. 2.25 మిలియన్ చదరపు అడుగుల స్థలంలో కమర్షియల్, ప్రీమియం హౌసింగ్ నిర్మాణాలు ఉంటాయి.