నిర్మాణ రంగంలో సాంకేతిక వినియోగం
వర్చువల్ గా ప్రాజెక్యుల సందర్శన
ప్రణాళిక-నిర్మాణానికి టెక్నాలజీ సహకారం
పర్యవేక్షణ-నిర్మాణ నాణ్యతకు సాంకేతిక చేయూత
ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వార ప్రాజెక్టు డిజైన్, డ్రాయింగ్
సాంకేతిక వినియోగంతో సకాలంలో నిర్మాణం పూర్తి
ఒకప్పుడు చిన్న ఇల్లు కట్టాలంటే యేడాది సమయం పట్టేది. కానీ ఇప్పుడు నెలల్లోనే ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్నారు. సంప్రదాయ నిర్మాణ పద్దతుల స్థానంలో అత్యాధునిక సాంకేతిక వచ్చి చేరింది. అవును భారత రియల్ ఎస్టేట్ రంగం టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్మాణ ప్రాజెక్టుల్లో సాంకేతికతను విరివిగా వాడుతున్నారు. దీంతో స్పష్టమైన ప్రణాళిక, వేగంగా నిర్మాణం, క్వాలిటీ కన్ స్ట్రక్షన్ తో పాటు మెటీరియల్ దుర్వినియోగం తగ్గిపోతోంది. ఇదంతా ప్రాజెక్టు వ్యయంపై ప్రభావం చూపుతుండటంతో చివరికి ఇంటి ధర కూడా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. అంటే ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా వ్యయ ప్రయాసతో కూడుకున్న పని. చిన్న ఇల్లు మొదలుపెడితే అది పూర్తయ్యేసరికి ఏ యేడాదో యేడాదిన్నరో అయ్యేది. కానీ ఇప్పుడు నిర్మాణరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా ఇట్టే పూర్తి చేస్తున్నారు. అలా అని గతంలోలా ఐదు అంతస్తులు, పది అంతస్తుల నిర్మాణాలు చాలా తక్కువ. ప్రస్తుతం చాలా రియల్ సంస్థలు 20 నుంచి 50 అంతస్తుల్లో నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టాయి. గతంలోలా సంప్రదాయ పద్ధతిలో నిర్మాణం చేస్తే సమయం చాలా ఎక్కువ పడుతుండటంతో, పాత పద్దతులకు గుడ్ బై చెప్పి, కొత్త టెక్నాలజీలకు వెల్ కం చెబుతున్నారు.
ప్రస్తుతం నిర్మాణ రంగంలో ప్రాజెక్టు ప్రణాళిక మొదలు అన్ని విభాగాల్లోనూ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. నిర్మాణ ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం యొక్క నాణ్యత, పర్యవేక్షణ వంటి వాటన్నింటిని సాంకేతిక సాయంతో చాలా సులభంగా పూర్తి చేస్తున్నారు. మార్కెట్ లో అందుబాటులో ఉన్న పలు రకాల సాఫ్ట్ వేర్స్ ద్వారా నిర్మాణ ప్రాజెక్టు డిజైన్, డ్రాయింగ్ తో కావలసిన మెటీరియల్, మ్యాన్ పవర్, బడ్జెట్, నిర్మాణ వ్యయంపై ఖచ్చితత్వం వస్తుంది. బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, మాడ్యులర్ కన్ స్ట్రక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సాంకేతిక వినియోగం తో నిర్మాణ నాణ్యత పెరుగుతుంది. గతంలో మట్టి, సిమెంటు ఇటుకలతో ఇంటి గోడలను నిర్మించేవారు. కాని ప్రస్తుతం అందుబాటులో ఉన్న మైవాన్ టెక్నాలజీ సాయంతో గోడలు సైతం కాంక్రీట్ తో కట్టేస్తున్నారు. దీంతో నాణ్యత పెరగడంతో పాటు త్వరితగతిన నిర్మాణం పూర్తవుతుంది.
నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ ని ఉపయోగించడం వల్ల రియల్ టైమ్ మానిటరింగ్ సాధ్యమవుతుంది ఇందు కోసం డ్రోన్లు,సెన్సార్లను ఉపయోగిస్తున్నారు. రియల్ టైమ్ మానిటరింగ్ తో కన్స్ స్ట్రక్షన్ రంగంలో తరుచుగా చోటుచేసుకునే ప్రమాదాలను నివారించడమే కాకుండా భద్రతకు ఎక్కువ అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆటోమేటెడ్ మెషినరీ సిస్టమ్ ద్వారా నిర్మాణానికి కావాల్సిన అంశాలన్నింటినీ ఆటోమేట్ ప్రోగ్రాం చేయడం వల్ల కూడా ప్రమాదాల నివారణ జరిగి కార్మికుల భద్రతకు అవకాశం ఉంటుందని అంటున్నారు. మరోవైపు వర్చువల్ రియాలిటీ నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. నివాస, వాణిజ్య నిర్మాణాలకు సంబంధించి ప్లాన్, ఎగ్జిక్యూషన్ కు వర్చువల్ రియాలిటీ దోహదం చేస్తోంది. అనుకున్న ప్రణాళికతో అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేసేందుకు వర్చువల్ రియాలిటీ ఎంతో ఉపయోగపడుతోంది.
ఇక ఇప్పుడు భారత్ నిర్మాణరంగంలో రోబోటిక్ లేఅవుట్ సాధనాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. రోబోటిక్ లేఅవుట్స్ కన్ స్ట్రక్షన్ టాస్క్‌లను ఆటోమేట్ చేయడంవల్ల మ్యాన్ పవర్ తగ్గడంతో పాటు అనుకున్న నిర్మాణ టాస్క్ ను త్వరితగతిన పూర్తి చేయవచ్చు. రోబోటిక్ లేఅవుట్స్ నిర్మాణానికి సంబంధించిన వర్క్ ను అతి ఖచ్చితత్వంతో షెడ్యూల్ చేయడం వల్ల వేగంగా నిర్మాణం జరగడంతో పాటు ఖర్చు సైతం తగ్గుతుంది. ఇది బిల్డర్ తో పాటు ఇల్లు కొనుగోలుదారులకు ఆర్ధిక భారాన్ని కొంత మేర తగ్గిస్తుంది. ఇక నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మరో సాంకేతిక అంశం బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. ఈ టెక్నాలజీ ఆటోమేటెడ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కాంప్లెక్స్ ద్వారా నిర్మాణంలో లోపాలను సరిచేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే తక్కువ లోపాలతో నిర్మాణ ప్రాజెక్ట్‌లను వేగంగా పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇక నిర్మాణరంగంలో ఇప్పుడు విరివిగా ఉపయోగిస్తున్న టెక్నాలజీ 3డి ప్రింటింగ్. దీని ద్వారా రోబోటిక్ లేఅవుట్ ప్రింటర్ల సాయంతో నిర్మాణానికి సంబంధించిన డిజైన్, లేఆవుట్, బిల్డింగ్ కాంపోనెంట్, డిజిటల్ మోడల్స్ ను నేరుగా ఆన్ సైట్ లో ప్రింట్ చేసుకోవచ్చు. అంతే కాదు వర్చువల్ రియాల్టీ ద్వార ఎప్పటికప్పుడు పని తీరును సరి చూసుకోవచ్చు. 3డి ప్రింటింగ్ రోబోటిక్ లేఅవుట్ టెక్నాలజీ ద్వారా వేగంగా నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఖచ్చితత్వం, నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ వెస్టేజ్ ను భారీగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కన్ స్ట్రక్షన్ రంగంలో అత్యంత ప్రభావం చూపుతున్న మరో టెక్నాలజీ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ డ్రోన్లు. అవును నిర్మాణాలకు సంబంధించి సైట్ సర్వే, మ్యాప్, ఆన్ సైట్ డేటా వంటిని అత్యంత కచ్చితత్వంతో క్రోడీకరించడానికి, ఆ తరువాత నిర్మాణ క్రమంలో నిర్వహించడానికి సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ డ్రోన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. దీని ద్వారా సమయం ఆదా అవ్వడమే కాకుండా స్పష్టమైన ప్రణాళికతో అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయవచ్చు.
ప్రస్తుతం నిర్మాణ రంగంలో సహజసిద్దంగా ఉపయోగించబడుతున్న సాంకేతిక మాడ్యూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ టెక్నాలజీ నిర్మాణ ప్రాజెక్టు షెడ్యూలింగ్ మరియు రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం ఎంతో దోహదం చేస్తుందు. నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశం డేటాను విశ్లేషించడం, నిర్మాణం షెడ్యూల్‌లను ఆప్టిమైజ్ చేయడం, కన్ స్ట్రక్షన్ మెటీరియల్ ను సమర్థవంతంగా వాడుకోవడం, ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేయడం వంటి ఎన్నో అంశాలను ఎగ్జిక్యూట్ చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథం. ఇక ప్రీ ఫ్యాబ్రికేషన్ టెక్నిక్స్ ను కూడా భారత నిర్మాణ రంగంలో బాగా ఉపయోగిస్తున్నారు. ప్రీ ఫ్యాబ్రికేషన్ తో ఆఫ్ సైట్ భాగాలను విడిగా తయారు చేసి, వాటిని నిర్మాణ ప్రదేశానికి తరలించి నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. ప్రీ ఫ్యాబ్రికేషన్ తో పద్ధతి ఆన్ సైట్ లేబర్‌ను తగ్గించడంతో పాటు నిర్మాణ వ్యర్థాలను తగ్గించి మొత్తం ప్రాజెక్ట్ టైమ్ లైన్‌ను వేగవంతం చేస్తుంది.
ఇక నిర్మాణ రంగంలో టెక్నాలజీ డిజిటల్ సూచనలతో నేరుగా ఫిజికల్ జాబ్ సైట్ కోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆటోమేటెడ్ మెషినరీ, అధునాతన ప్రాజెక్ట్ ప్లానింగ్ మరియు మేనేజ్మెంట్ టూల్స్ ను వాడుతున్నారు. గతంలో నిర్మాణ సామగ్రి పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యేది. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో అది 90 శాతం మేర తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇక నిర్మాణ ప్రాజెక్టు లో పనిచేసే పలు విభాగాల బృందాలతో సమన్వయం చేసుకునేందుకు సైతం టెక్నాలజీని వినియోగించడంతో పని సులభతరం అవుతోంది. ఇప్పటికే డిజిటల్ మార్కెటింగ్, ఆన్ లైన్ అమ్మకాల్లో జోరు పెంచిన నిర్మాణరంగం.. ఇప్పుడు కన్ స్ట్రక్షన్ లోను ఆధునిక సాంకేతికను జోడించి మరింత దూసుకుపోతోంది. నిర్మాణ రంగంలోని అత్యాధునిక టెక్నాలజీ ద్వారా బిల్డరుకు సకాలంలో ప్రాజెక్టు పూర్తవ్వడం, మెటీరియల్ వెస్టేజ్ తగ్గడం, అనుకున్న మేరకు నిర్మాణం జరగడం వంటి కారణాల వల్ల నిర్మాణ ప్రాజెక్టు ఖర్చు తగ్గుతుంది. అంది ఇంటి ధరపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఇంటి కొనుగోలుదారుడికి సైతం కొంత తక్కువ ధరకే ఇల్లు లభిస్తుంది.