- నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
- ఇలా చేస్తే విదేశీ వలసలు తగ్గుతాయ్
- గ్రామీణ యువతకు నెలసరి ఆదాయం
- సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలుస్తారు
( కింగ్ జాన్సన్ కొయ్యడ, 9030034591)
మీరు హైదరాబాద్‌లోని బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాలు, లగ్జరీ విల్లాల సైట్లలో పని చేసే భవన నిర్మాణ కార్మికుల్ని నిశితంగా పరిశీలించారా? ఇంటి నిర్మాణంలో కీలకమైన మార్బుల్, గ్రానైట్ పనులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబింగ్ పనులు వంటి వాటిలో తెలంగాణకు చెందిన సిబ్బంది పని చేయడం ఎప్పుడైనా చూశారా? అదే మన తెలంగాణకు చెందిన పదిహేను లక్షల మంది కార్మికులు దుబాయ్, షార్జా, కువైట్, ఒమన్, ఖతార్లలో పని చేస్తుంటారు. భాగ్యనగరంలోనే వందలాది బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాల నిర్మాణం జరుగుతుంటే.. తెలంగాణ యువత మొత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎందుకు ఆగమైపోతున్నారు? వారికి నైపుణ్యాల్ని నేర్పించి.. ఇక్కడే ఉద్యోగాల్ని ఇప్పించొచ్చు కదా! ఇది వాస్తవరూపం దాల్చితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
వచ్చే పదేళ్లలో.. మన దేశ నిర్మాణ రంగానికి.. నాలుగున్నర కోట్ల స్కిల్డ్ వర్క్‌ఫోర్స్ కావాలి. అంటే, సుశిక్షితులైన పనివాళ్లు అవసరం. ఇప్పటివరకూ తెలంగాణ నిర్మాణ రంగం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పదిహేను లక్షల కార్మికుల మీద ఆధారపడింది. మరి, ఏయే రాష్ట్రాల నుంచి ఎవరెవరు తెలంగాణకు విచ్చేస్తున్నారంటే..
- తాపీ మేస్త్రీలు: ఒరిస్సా, జార్ఖండ్, ఏపీ
- షట్టరింగ్, బార్ బెండర్స్: బెంగాల్, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్
- పేయింటర్స్: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
- టైల్స్ వేసేవారు: తమిళనాడు
- జిప్సమ్ పనివారు: తమిళనాడు
- కార్పెంటర్లు, గ్రానైట్, మార్బుల్: రాజస్థాన్
- వీరి జీతాలు ఎలా ఉంటాయ్?
- తాపీ మేస్త్రీలు: రూ. 40 వేలు
- షట్టరింగ్, బార్ బెండర్లు: రూ. 40 వేలు
- పేయింటర్లు: రూ. 40 వేలు
- టైల్స్ వేసేవారు: రూ. 40 వేలు
- జిప్సమ్ పనివారు: రూ.40 వేలు
- కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు: రూ. 40 వేలు
- గ్రానైట్, మార్బుల్ పనివారు: రూ. 40 వేలు
- గార్డనర్లు, హౌస్ కీపర్లు: రూ.30 వేలు
- వాటర్ ప్రూఫింగ్, ఫ్యాబ్రికేటర్లు: రూ.40 వేలు
అదే, తెలంగాణ నుంచి దుబాయ్, గల్ఫ్, ముంబైలకు వెళ్లేవారు నెలకు సంపాదించేది 30 నుంచి 50 వేల దాకా ఉంటుంది. మరి, మన రాష్ట్రంలోనే వీరికి శిక్షణనిచ్చి, ఉద్యోగావకాశాల్ని కల్పిస్తే ఉత్తమం కదా.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు చదువుల్లో మెరుగ్గా ఉంటారు. కానీ, ప్రాక్టీకల్ శిక్షణ మాత్రం ఉండట్లేదు. 12వ తరగతి కంటే తక్కువ చదువుకున్నవారు, నిర్మాణ రంగంలోని వివిధ పనుల్లో చేరినా సీనియర్ వర్కర్ల పర్యవేక్షణలో పని చేస్తారు తప్ప.. వీరిలో అధిక శాతం మందికి.. వారు చేసే పనికి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం ఉండకపోవడం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. కాబట్టి, ఈ గ్యాప్‌ను పూరించేందుకు నిర్మాణ రంగంలో పనిచేసేవారికి థియరీతో పాటు ప్రాక్టీకల్ చదువులూ ఎంతో కీలకమని చెప్పొచ్చు.
తెలంగాణకు చెందిన యువతలో నైపుణ్యం పెంపొందించే శిక్షణను అందిస్తే సుశిక్షుతులైన పనివారుగా తయారౌతారు. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, టైల్ లేయర్, పేయింటర్, మేసన్, బార్ బెండర్, కార్పెంటర్ వంటి వృత్తుల్లో.. సుమారు ఆరు నెలల శిక్షణను అందించాలి. ఇందులో మూడు నెలలు థియరీ, మూడు నెలలు ఆన్‌సైట్‌లో శిక్షణను అందించాలి. అప్పుడే నిరుద్యోగ యువత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు.
ప్రపంచ స్కిల్ ఫోర్స్ ఎలా?
ప్రపంచవ్యాప్తంగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ విషయాన్ని గమనిస్తే.. 96 శాతం మంది నైపుణ్యం గల పనివారు దక్షిణ కొరియాలో ఉండగా.. జపాన్లో 80 శాతం మంది, చైనాలో 47 శాతం మంది ఉన్నారు. అయితే, మన భారతదేశంలో ఉన్న స్కిల్డ్ వర్క్ ఫోర్స్ విషయానికొస్తే.. కేవలం రెండు శాతమే ఉన్నారు. అయితే, ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. మన వద్ద నైపుణ్యం గల సిబ్బందిని తయారు చేసేందుకు అవసరమయ్యే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిద్ధంగా ఉంది. మన రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలు, 169 పాలిటెక్నిక్ కాలేజీలు, 292 ఐటీఐ కాలేజీలున్నాయి. మరి, మన రాష్ట్రంలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ను పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి?
ఎంఏయూడీదే కీలకపాత్ర
తెలంగాణలో నగరాలు, పట్టణాలు అభివృద్ధి చెందడంలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యభూమిక పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ శాఖ ఏం చేయాలంటే.. క్రెడాయ్ తెలంగాణ వంటి నిర్మాణ సంఘాలతో ఎంవోయూ కుదుర్చుకుని.. ఆర్కిటెక్టులు, స్ట్రక్చరల్ ఇంజినీర్లు, ఎంఈపీ కన్సల్టెంట్లు, ల్యాండ్ స్కేపింగ్ మరియు సర్వేయర్లతో యువతకు శిక్షణను ఇప్పించాలి. ఈ క్రమంలో జేఎన్‌టీయూను భాగస్వామిగా చేర్చుకోవాలి. అదేవిధంగా 175 ఇంజినీరింగ్ కాలేజీలు, 169 పాలిటెక్నిక్ కాలేజీలు, 292 ఐటీ కాలేజీలు, ఎంబీఏ కాలేజీల్లో.. నిర్మాణ రంగానికి అవసరమయ్యే అంశాల్లో ప్రత్యేక శిక్షణను అందించేందుకు ఏర్పాట్లు చేయాలి. ఎంబీఏ కళాశాలల్లో మార్కెటింగ్, సేల్స్ ఫ్యాకల్టీని నియమించాలి. ఇందుకు అవసరమయ్యే మొత్తం ఖర్చును రాబట్టేందుకేం చేయాలంటే.. లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్ నిమిత్తం వసూలు చేసే సొమ్ములో కొంత శాతాన్ని ఈ శిక్షణ కోసం వెచ్చించాలి.
ఇలా చేస్తే ఉత్తమం..
ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ కాలేజీల ఫ్యాకల్టీ ద్వారా స్కిల్డ్ ఫోర్స్‌ను తయారు చేసేందుకు ప్రత్యేక శిక్షణను అందించాలి.
90 రోజులు కాలేజీ తరగతుల్లో.. 90 రోజులు వివిధ సైట్ల వద్ద ప్రాక్టికల్ శిక్షణను అందించాలి. అప్పుడే, మన రాష్ట్రానికి చెందిన యువత గ్రేడ్-ఏ సిబ్బందిగా తయారౌతారు.
ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, పేయింటర్లు, తాపీ మేస్త్రీలు, స్టోన్ – గ్రానైట్ – మార్బుల్ లేయర్లు, వాటర్ ప్రూఫ్ టెక్నీషియన్లు, జిప్సమ్ అప్లికేటర్లు, ఫ్యాబ్రికేటర్లు, షట్టరింగ్ మరియు బార్ బెండర్లు, రియల్ ఎస్టేట్ సేల్స్‌కు అవసరమయ్యే సాఫ్ట్ స్కిల్స్, మార్కెటింగ్ ప్రొఫెషనర్లుగా తెలంగాణ యువత ఎదుగుతారు.
ఇలా చేస్తే లక్ష్యానికి చేరుకుంటాం
మీకో విషయం తెలుసా? ప్రపంచలోనే అతిపెద్ద ట్యాక్సీ కంపెనీ అయిన ఊబర్ కు సొంత వాహనాలు లేనే లేవు.
ప్రపంచంలోనే పేరెన్నిక గల మీడియా ఓనర్ అయిన ఫేస్‌బుక్ సొంతంగా కంటెంట్ క్రియేట్ చేయనే చేయదు.
అతిపెద్ద రిటైలర్ అయిన అలీబాబా వద్ద ఇన్వెంట్రీ ఉండనే ఉండదు.
ప్రపంచంలోనే అతిపెద్ద వసతి గృహాన్ని కల్పించే ఎయిర్ బీఎన్‌బీకి సొంత రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు లేనే లేవు.
స్టాన్‌ఫోర్డ్, హార్వార్డ్ వంటి యూనివర్శిటీలు ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ కోర్సుల్లో చేరడానికి అనేకమంది భారతీయులు ఆసక్తి చూపెడుతున్నారు. పైగా, అవి అందించేవి కేవలం థియరీ మాత్రమే. కానీ, తెలంగాణలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ను భాగస్వామిగా చేసుకుని.. పట్టణాలు, గ్రామాల్లో డిజిటల్ క్లాస్ రూముల్ని ఏర్పాటు చేసి.. థియరీని నేర్పించొచ్చు. ఆతర్వాత క్రెడాయ్ తెలంగాణ వంటి నిర్మాణ సంఘాల సహకారంతో.. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో.. ప్రాక్టీకల్ తరగతుల్ని సైతం నిర్వహించొచ్చు. కాబట్టి, ఇలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తే.. తెలంగాణలోని యువతకు బంగారు భవిష్యత్తును ఇచ్చినట్లు అవుతుంది.