హైడ్రా పని తీరు భలే విచిత్రంగా ఉంది. బఫర్ జోన్లలో అనుమతినిచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు, దానిపై సంతకం పెట్టిన కమిషనర్లపై చర్యల్ని తీసుకోకుండా వదిలేసింది. స్థానిక సంస్థల అనుమతి ఉందన్న భరోసాతో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం అందులో ఫ్లాట్లను కొంటే.. ఆ విషయం తెలిసీ, పోలీసుల బలగంతో వచ్చి.. ఆయా అపార్టుమెంట్లను కూల్చేస్తున్నారు. మరి, అప్పో సొప్పో చేసి.. బ్యాంకు రుణం తీసుకున్న వారంతా ఇప్పుడేం చేయాలి? నిన్నటి వరకూ కళ్ల ముందే నిర్మాణం అవుతున్న అపార్టుమెంటునేమో.. హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. మరి, సొంతింటి కోసం గృహరుణం తీసుకున్న వారి పరిస్థితి ఏం కావాలి? వీరు ఇప్పుడు నెలసరి వాయిదా కట్టాలా? వద్దా?
అపార్టుమెంట్‌లో ఫ్లాట్ కొనాలంటే.. తొలుత ఇరవై శాతం సొమ్మును కొనుగోలుదారులే మార్జిన్ మనీగా చెల్లించాల్సి ఉంటుంది. రెండు పడక గదుల ఫ్లాట్ సుమారు రూ.70 లక్షలు అనుకుందాం. అందులో ఇరవై శాతం మార్జిన్ మనీగా రూ.14 లక్షలను బయ్యర్లే భరించాల్సి ఉంటుంది. ఈ మార్జిన్ మనీని కట్టడానికి అనేక ఇబ్బందులతో సర్దుబాటు చేస్తారు. అదే ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాటయితే ఎంతలేదన్నా రూ.90 లక్షలైనా అవుతుంది. ఇందుకోసం ఎంతలేదన్నా రూ.20 లక్షలను మార్జిన్ మనీగా కడతారు.
ఇలాంటి సందర్భంలో.. బయ్యర్లు కట్టిన మార్జిన్ మనీని ఎవరు వెనక్కిస్తారు? ఆమ్యామ్యాల మత్తులో స్థానిక సంస్థల అధికారులు అనుమతి ఇచ్చారనుకుందాం.. కానీ, ఆ విషయం బయ్యర్లకు ఎలా తెలుస్తుంది? జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏ అనుమతి ఉంది కాబట్టి.. అది చూశాకే చాలామంది ఫ్లాట్లను కొనుగోలు చేస్తారు. ఇప్పుడు హఠాత్తుగా హైడ్రా వచ్చి ఆయా అపార్టుమెంట్లను కూల్చివేస్తే.. తొలుత మార్జిన్ మనీని కట్టిన బయ్యర్లకు సొమ్ము వెనక్కి ఎవరిస్తారు? ఫ్లాట్లను కొన్నవారికి హైడ్రాయే ఆయా సొమ్మును వారికి వెనక్కి ఇప్పించే ఏర్పాట్లు ఏమైనా చేస్తుందా?
అధికారుల నుంచి వసూలు!
చెరువులు, కుంటలు, బఫర్ జోన్‌లో అపార్టుమెంట్లను కట్టేందుకు స్థానిక సంస్థల అధికారులే అనుమతులిచ్చారు. అంటే, వారు లంచాలు తీసుకుని అనుమతినిచ్చారని హైడ్రా అంటోంది. కాబట్టి, బయ్యర్లు ఆయా అపార్టుమెంట్ కోసం కట్టిన మార్జిన్ మనీని.. వాటికి అనుమతినిచ్చిన అధికారుల నుంచి వసూలు చేసి తమ సొమ్మును వెనక్కి ఇప్పించాలని బయ్యర్లు కోరుతున్నారు. అంతేకాదు, అక్రమ రీతిలో అనుమతులిచ్చిన అధికారులను అరెస్టు చేసి జైల్లో కూర్చోపెట్టాలి. భవిష్యత్తులో ఏ అధికారి అయినా అక్రమ రీతిలో అనుమతినివ్వాలంటేనే భయపడే విధంగా.. అక్రమ ఆఫీసర్లకు శిక్ష విధించాలని బాధిత బయ్యర్లు కోరుతున్నారు.