అండర్ పాస్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి ఐదు అండర్ పాస్ ఫ్లై ఓవర్లు
పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం
కేబీఆర్ పార్క్ చుట్టూ రేడియల్ రోడ్ల విస్తరణకు లైన్ క్లియర్
కేబీఆర్ ఎంట్రన్స్ నుంచి.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ 45,
ఫిలింనగర్, అగ్రసేన్ మహరాజ్ విగ్రహం, బసవతారకం లవైపు
అండర్ పాస్ ఫ్లై ఓవర్ల నిర్మాణం
హైదరాబాద్ మహానగర అభివృద్దిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిసరాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రణాళికల్ని సిద్దం చేసింది. గ్రేటర్ సిటీ నడిబొడ్డు జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు సిగ్నల్ రహిత జంక్షన్లను అభివృద్ది చేసేందుకు యాక్షన్ ప్లాన్ ని ప్రకటించింది. కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం ఆరు ట్రాఫిక్ జంక్షలను ఏర్పాటు చేసి నగరాన్ని మరింత సుందరీకరణ చేసేందుకు కరసత్తు చేస్తోంది.
హైదరాబాద్ మహానగరం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చెందుతోంది. ఐటీ నుంచి మొదలు, బల్క్ డ్రగ్, ఫార్మా, ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్ వంటి ఎన్నో రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోంది. ఈ క్రమంలో భాగ్యనగరానికి మరిన్ని మౌలిక వసతులు కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఓ వైపు ఫ్యూచర్ సిటీని ప్రకటించడంతో పాటు అక్కడ చకచకా పలు ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేస్తున్న రేవంత్ సర్కార్.. హైదరాబాద్ లోని మౌలిక వసతులను మరింత మెరుగుపరచడంపై దృష్టి సారించింది. ఈ మేరకు నగరం నడిబొడ్డున ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ చుట్టూ అంతర్జాతీయ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
జూబ్లీహిల్స్ లో నుంచి నిత్యం నగరం నలువైపుల నుంచి లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఐటీ కారిడార్ వైపు మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు వెళ్లే వాహనాలతో భారీగా ట్రాఫిక్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రహిత జంక్షన్లను అభివృద్ది చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా కేబీఆర్ చుట్టూ మొత్తం 6 జంక్షన్లను రెండు దశలో చేపట్టేందుకు ప్రతిపాదనల్ని సిద్దం చేసింది. ఈ ఆరు జంక్షన్ల నిర్మాణంలో భాగంగా అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. వర్షపు నీరు లేకుండా అండర్ పాస్ ల నిర్మాణాన్ని డిజైన్ చేస్తున్నారు. సవ్య దిశలో వెళ్లేందుకు అండర్ పాస్ లు, అప సవ్య దిశలో వెళ్లేందుకు ఫ్లై ఓవర్ ల నిర్మాణాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కోసం రూ. 826 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు తెలంగాణ సర్కార్ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో మొదటి దశ పనులను మొదలుపెట్టేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
జూబ్లీహిల్స్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్లతో జంక్షన్ లను అభివృద్ది చేయడం ద్వారా హైదరాబాద్ రూపు రేఖలు మారిపోనున్నాయి. అయితే కేబీఆర్ పార్క్ అంతా అటవి శాఖ ఆధీనంలో ఉండటం, పర్యావరణ అనుమతులు అవసరం ఉండటంతో ఏ మేరకు ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందన్నదే ఇప్పుడు సందిగ్దంగా మారింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ జంక్షన్లను అభివృద్ది చేసేందుకు ప్రయత్నించినా పర్యావరణ అనుమతుల కారణంగా ముందుకు వెళ్లలేదు. ఏదేమైనా ఈ ప్రాజెక్టు పూర్తయితే మాత్రం హైదరాబాద్ రూపురేఖలు మరో లెవల్ కు వెళతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.