ఇళ్ల విక్రయాలు 5 శాతం పెరుగుదల
18 శాతం పెరిగిన ఆఫీస్ లీజింగ్
నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడి
దేశవ్యాప్తంగా రెసిడెన్షియల్ రియల్ రంగానికి ఊపు వచ్చింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 5 శాతం పెరిగాయి. ఆఫీస్ లీజింగ్ కూడా 18 శాతం పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జూలై-సెప్టెంబర్ కాలంలో ఈ ఎనిమిది నగరాల్లో 87,108 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో 82,612 యూనిట్లు విక్రయమయ్యాయి. స్థూల ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 18 శాతం పెరిగి 19 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. మన హైదరాబాద్ విషయానికి వస్తే ఇళ్ల అమ్మకాలు 9 శాతం పెరిగి 9,114 యూనిట్లకు చేరుకున్నాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ మాత్రం 26 శాతం తగ్గి 2.2 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజింగ్ 2.9 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
ముంబైలో రికార్డు స్థాయిలో 24,222 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాల కంటే ఇది 9 శాతం ఎక్కువ. ఇక్కడ కూడా ఆఫీస్ లీజింగ్ 17 శాతం తగ్గిపోయి 2.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. బెంగళూరులో 11 శాతం వృద్ధితో 14,604 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఇక్కడ రెండున్నర రెట్లు పెరిగి 5.3 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఇది 2.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. పుణెలో ఇళ్ల అమ్మకాలు ఒక శాతమే పెరిగి 13,200 యూనిట్లుగా నమోద్యాయి. ఇక్కడ కార్యాలయ స్థలాల లీజింగ్ 14 శాతం క్షీణించి 2.6 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది.
ఇళ్ల మార్కెట్‌లో సానుకూల ధోరణి నెలకొందని, క్యూ3లో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. రూ.కోటికి మించి ధర కలిగిన ప్రీమియం ఇళ్లకు ఏర్పడిన డిమాండ్ అమ్మకాల వృద్ధికి సాయపడుతున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ వెల్లడించారు. అందుబాటు ధరల విభాగంలో ఇళ్ల అమ్మకాలు తగ్గినట్లు చెప్పారు.