కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడి
దేశంలో ఆఫీసు అద్దెలు పెరిగాయి. ముఖ్యంగా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో సగటు కార్యాలయ అద్దెలు 2024లో మొదటిసారిగా కోవిడ్ ముందు స్థాయిని అధిగమించినట్టు కొలియర్స్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ఢిల్లీ, పుణెల్లో 2019-2024 కాలంలో సగటు ఆఫీసు అద్దెలు అత్యధికంగా 8 శాతం పెరగ్గా.. ముంబై, చెన్నై 5 నుంచి 6 శాతం పెరుగుదలతో తర్వాతి స్థానాల్లో నిలిచినట్టు తెలిపింది. హైదరాబాద్, పుణె వంటి కొన్ని నగరాలు 2022లోనే కరోనా ముందున్న అద్దెలు సాధించగా.. 2023లో బెంగళూరు, చెన్నైలు ఆ స్థాయిని చేరుకున్నాయి. తాజాగా ఢిల్లీ, ముంబై ఆ పరిస్థితికి చేరుకున్నట్టు తాజా నివేదిక వివరించింది.
కరోనా తర్వాత ఆఫీస్ మార్కెట్ డిమాండ్ రికవరీ వేగంగా జరిగిందని.. 2020, 2021లో డిమాండ్ తగ్గిన తర్వాత, 2022 నాటికి లీజింగ్ కార్యకలాపాలు పూర్తిగా పుంజుకున్నాయని తెలిపింది. వాస్తవానికి, 2022 నుంచి ప్రతి సంవత్సరం భారతదేశ స్థాయిలో ఆల్-టైమ్-హై గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌ను పెంచుతున్నట్లు నివేదిక పేర్కొంది. ‘నగరాల్లో అద్దె వృద్ధి మారుతూ ఉన్నప్పటికీ, 2024 చివరి నాటికి సగటు అద్దెల్లో వార్షిక పెరుగుదల ఇతర మార్కెట్లతో పోలిస్తే ఢిల్లీ, పుణె వంటి కొన్ని నగరాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది’ అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అర్పిత్ మెహ్రతా పేర్కొన్నారు. 2019-2024 కాలంలో మొదటి ఆరు నగరాల్లోని ఎంపిక చేసిన ప్రధాన మైక్రో మార్కెట్లు 25శాతం వరకు అద్దె వృద్ధిని సాధించినట్టు నివేదిక తెలిపింది.
ఢిల్లీ లోని గోల్ఫ్ కోర్స్ ఎక్స్ టెన్షన్ రోడ్, నోయిడా ఎక్స్ ప్రెస్ వే, సైబర్ సిటీ వంటి కోర్ మైక్రో మార్కెట్లలో గత ఐదేళ్లలో అద్దెలు 25 శాతం వరకు పెరిగాయి. అదే సమయంలో బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్, వైట్‌ఫీల్డ్ వంటి హై యాక్టివిటీ మైక్రో మార్కెట్లు 2019-2024 కాలంలో 5 నుంచి10 శాతం మేర అద్దెలు పెరిగాయి. చెన్నైలోని ఓఎంఆర్ జోన్-1, ముంబైలోని గోరేగావ్/జేవీఎల్ఆర్, బీకేసీ వంటి ఇతర ప్రధాన మైక్రో మార్కెట్‌లలో కార్యాలయ అద్దెలు కూడా మహమ్మారికి ముందు స్థాయిల నుంచి 10-20 శాతం మేర పెరిగాయి.