తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన అటవీ అనుమతులకు గ్రీన్ సిగ్నల్ వచ్చంది. ఈ మేరకు రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇక ట్రిపుల్ ఆర్ దక్షిణ, ఉత్తర బాగాల నిర్మాణానికి నిన్నటి వరకు ఉన్న అటవీశాఖ అడ్డంకులు తొలగిపోయాయి. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి ప్రధాన సమస్యగా ఉన్న అటవీ భూములకు సంబంధించిన అనుమతులను ఇస్తూ.. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ.
ఈ అనుమతుల ప్రకారం మెదక్ జిల్లాలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 28.2544 హెక్టార్లు, మరియు యాదాద్రి-భువనగిరి జిల్లాలో 8.511 హెక్టార్లు.. మొత్తంగా మూడు జిల్లాల్లో కలిపి 72.3536 హెక్టార్ల అటవీ భూమిని భారత్ మాల పరియోజన ఫేజ్-1 కింద ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ గజ్వేల్, ప్రయోజనార్థం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకు సంబంధించిన వివిధ నిబంధనల అమలుకు అనుగుణంగా అటవీ అనుమతులు లోబడి భూసేకరణ చేస్తామని పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.