ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో పరిష్కారం కావాల్సిన ధరణి సమస్యల కోసం సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ సర్క్యులర్ జారీ చేశారు. ధరణి కమిటీ సూచనల మేరకు మార్గదర్శకాలను జారీ చేసినట్లు భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన సీసీఎల్‌ఏ ఇచ్చిన సర్క్యులర్‌కు లోబడి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ స్థాయిలో మ్యూటేషన్, పట్టాదార్ పాస్ బుక్స్, నాలా కన్‌వర్షన్, పట్టాదారు పాస్ పుస్తకంలో సవరణలు తదితరాలు ఉన్నట్లు వివరించారు. అందులో పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్చేటప్పుడు కచ్చితంగా మార్గదర్శకాలను అనుసరించాలన్నారు.
ఎమ్మార్వో దరఖాస్తులను పరిశీలన చేసి ఆర్డీవోకు పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎమ్మార్యో దగ్గర నుంచి వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అదనపు కలెక్టర్‌కు ఆర్డీవో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఎమ్మార్వో, ఆర్డీవోల పరిశీలన తరువాత తనకు వచ్చిన దరఖాస్తులను సంపూర్ణంగా పరిశీలించి ఆమోదం తెలియ చేయడం కాని, తిరస్కరించడం కానీ చేయాలని స్పష్టం చేశారు. అయితే దరఖాస్తు తిరస్కరణ చేసినట్లయితే ఏ కారణం చేత చేస్తున్నారో స్పష్టం చేయాలన్నారు.
ఆర్డీవో స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలకు సంబంధించిన పెండింగ్ నాలా, డిజిటల్ సైన్ తదితర వాటిని పరిష్కారం చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ సర్క్యులర్‌లో అధికారులకు సూచించారు. కలెక్టర్‌తో సంబంధం లేకుండా ఇకపై అదనపు కలెక్టర్ వద్ద 5 రకాల సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. ధరణిలో నాలుగు మాడ్యూళ్ల ద్వారా వచ్చే దరఖాస్తులను అదనపు కలెక్టర్లు పలు సూచనలు పాటించాల్సి ఉంటుంది.
అదనపు కలెక్టర్ స్ఠాయిలో యజమాన్య హక్కు బదిలీ దరఖాస్తులు (టీఎం3- మ్యూటేషన్), కోర్టు కేసులతో ముడిపడి.. పాస్‌పుస్తకాల కోసం వచ్చే దరఖాస్తులు (టీఎం24), పట్టా పాసు పుస్తకం లేదా వ్యవసాయేతర భూమిగా మార్చడానికి ఆటంకంగా ఉన్న రికార్డుల్లో గృహం, హౌస్ సైట్ అని నమోదైన వాటికి సంబంధించిన దరఖాస్తులు (టీఎం31), పాసు పుస్తకంలో తప్పుల సవరణ (టీఎం33), పేరు మార్పిడి దరఖాస్తులు (టీఎం33) సమస్యలను పరిష్కరిస్తారు.
ఇక ఆర్డీవో స్థాయిలో వారసత్వ బదిలీలకు సంబంధించిన దరఖాస్తులు (టీఎం4), అసైన్డ్ భూములకు పాసు పుస్తకాలు లేని దరఖాస్తులు (టీఎం27), వ్యవసాయేతర భూముల మార్పిడికి సంబంధించినవి (టీఎం27), సర్వే నంబర్లు, డిజిటల్ సంతకాల దరఖాస్తులను (టీఎం33) పరిష్కరిస్కారు.
తెలంగాణలో ధరణి పోర్టల్ పెండింగ్ సమస్యలతో చాలా కాలంగా భూముల వివాదాలు నెలకొన్నాయి. దీంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లా భూముల క్రయ విక్రయాలపై దీని ప్రభావం పడింది. ఎట్టకేలకు ప్రభుత్వం ధరణి పోర్టల్ సమస్యలపై దృష్టి సారించి, అడీషనల్ కలెక్టర్, ఆర్డీఓకు పెండింగ్ సమస్యల పరిష్కారానికి సంబందించిన అధికారాలను కట్టబెట్టింది. దీంతో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ రికార్డుల సమస్యలు పరిష్కారం కానున్నాయి.
ఈ క్రమంలో రికార్డుల కారణంగా ఆగిపోయిన భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఊపందుకోనున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. తద్వార నిర్మాణరంగం సైతం స్పీడందుకోనుందని అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 2 వేల ఎకరాల భూములకు సంబంధించిన ధరణి పెండింగ్ రికార్డులు పరిష్కారం కానున్నాయని అధికారిక వర్గాల సమాచారం.