- భారతదేశ కొత్త అల్ట్రా లగ్జరీ రియల్ హబ్ గా అవతరణ
2024.. భారతదేశ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డ బద్దలుకొట్టిన సంవత్సరం. గుర్గావ్ లోని జా డ్రాపింగ్ డీల్స్ నుంచి ముంబైలో బ్లాక్ బస్టర్ అమ్మకాల వరకు రియల్ జోరు కొనసాగుతోంది. ఇక విలాసవంతమైన రియల్ ఎస్టేట్ కేటగిరీలో ముంబై, బెంగళూరులకు గురుగ్రామ్ గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా గురుగ్రామ్ లోని డీఎల్ఎఫ్ కామెలియాస్ ప్రాజెక్టు రికార్డు బ్రేకింగ్ అమ్మకాలతో ఈ నగరం దూసుకెళ్తోంది. తద్వారా అల్ట్రా లగ్జరీ మార్కెట్లో ముంబైని మించి ముందుకెళ్తోంది.
ఇన్ఫో ఎక్స్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ సీఈఓ రిషి పార్టి డీఎల్ఎఫ్ కామెలియాస్ లో 16,290 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అల్ట్రా లగ్జరీ పెంట్ హౌస్ కు రూ.190 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే చదరపు అడుగు ధర రూ.1.80 లక్షలుగా పలికింది. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన లావాదవీల్లో ఒకటిగా నమోదైంది. ఇది గురుగ్రామ్ కు ఖ్యాతి పెంచడమే కాదు.. దేశంలోని ఇతర పెద్ద లావాదేవీలను సైతం వెనక్కి నెట్టినట్టయింది. ముంబై వర్లిలోని ఒబెరాయ్ 360 వెస్ట్ లో రెండు అపార్ట్ మెంట్లను గ్రేట్ వైట్ గ్లోబల్ సంస్థ రూ.225 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే ఆర్ఆర్ కాబెల్ ప్రమోటర్ శ్రీగోపాల్ కాబ్రా అదే భవనంలోని 62వ అంతస్తులో 13,809 చదరపు అడుగుల ఫ్లాట్ ను రూ.198 కోట్లకు కొన్నారు.
ముంబైలోని లోధా మలబార్ లో మూడు ఫ్లాట్లను పరమ్ కేపిటల్స్ కు చెందిన ఆశా ముకుల్ అగర్వాల్ రూ.263 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇలాంటి పెద్ద లావాదేవీలు ముంబైలో జరిగినా.. గురుగ్రామ్ లో తొలిసారి భారీ లావాదేవీ జరగడంతో వీటన్నింటినీ వెనక్కి నెట్టేసింది. ఢిల్లీ, ముంబైలను అధిగమించి భారతదేశపు కొత్త లగ్జరీ రాజధానిగా గుర్గావ్ అవతరించిందని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు సమీర్ జసుజా వ్యాఖ్యానించారు. విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలు గుర్గావ్‌లోని తమ కార్యాలయాలకు దగ్గరగా నివసించడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు.
25 సంవత్సరాల క్రితం చదరపు అడుగుకి రూ.1,800 చొప్పున విక్రయించిన డీఎల్ఎఫ్ అరాలియాస్ వంటి ఐకానిక్ ప్రాజెక్టులు.. డీఎల్ఎఫ్ కామెలియాస్ వంటి నేటి లగ్జరీ బెంచ్‌మార్క్ కు ఎలా మార్గం సుగమం చేశాయో జసుజా వివరించారు. 2024లో ముంబై, హైదరాబాద్, గురుగ్రామ్, బెంగళూరు వంటి నగరాల్లో రూ.40 కోట్ల కంటే పైబడిన 25 అల్ట్రా-లగ్జరీ రెసిడెన్షియల్ డీల్స్ జరిగాయని అనరాక్ వెల్లడించింది. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.2,443 కోట్లు కాగా.. సంఖ్యాపరంగా ముంబై ముందు వరసలో ఉందని పేర్కొంది.