- ఈ ఏడాది 14 శాతం వృద్ధి
- కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ నివేదిక వెల్లడి
దేశంలో ఆఫీసు స్పేస్ లీజింగ్ జోరు కొనసాగింది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 14 శాతం వృద్ధితో నమోదైంది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 85 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ లీజింగ్ జరిగినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ పేర్కొంది. 2023లో ఇది 74.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 66.7 మిలియన్ చదరపు అడుగుల స్థూల లీజింగ్ లావాదేవీలు జరిగినట్టు వెల్లడించింది.
2018లో 49.1 మిలియన్ చదరపు అడగులు, 2019లో 67.7 మిలియన్ చదరపు అడగులు, 2020లో 46.6 మిలియన్ చదరపు అడగులు, 2021లో 50.4 మిలియన్ చదరపు అడగులు, 2022లో 72 మిలియన్ చదరపు అడగులు, 2023లో 74.6 మిలియన్ చదరపు అడగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. ఐటీ-బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (ఐటీ-బీపీఎం), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్‌ఎస్‌ఐ), ఇంజనీరింగ్, తయారీ రంగాలతోపాటు, ఫ్లెక్స్ ఆపరేటర్ స్పేస్ విభాగాలే ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. ‘2024 భారత ఆఫీస్ రంగానికి రికార్డుగా నిలిచిపోతుంది. స్థూల లీజింగ్ ఈ ఏడాది 85 మిలియన్ చదరపు అడగులకు చేరుకోవచ్చు. ఇందులో నికర వినియోగం 45 మిలియన్ చదరపు అడగులుగా ఉండొచ్చు. భారత వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో అత్యధిక గరిష్ట స్థాయి ఇది’ అని కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ తెలిపింది.