నెలకు రూ.2.8 కోట్ల అద్దె
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ హైదరాబాద్ లోని తన ఆఫీసు స్థలానికి సంబంధించిన లీజును పునరుద్ధరించింది. హైటెక్ సిటీలో ఉన్న తన ఆఫీసుకు నెలకు రూ.2.8 కోట్ల అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. 3.7 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని రెండు వేర్వేరు లావాదేవీల్లో పునరుద్ధరించింది. 84,053 చదరపు అడుగుల స్థలానికి రూ.65.7 లక్షల అద్దె చెల్లించేలా.. 2.8 లక్షల చదరపు అడుగుల స్థలానికి రూ.2.15 కోట్లు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంది. మొత్తం ఐదేళ్ల కాలానికి ఒప్పందం చేసుకోగా.. సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.16.8 కోట్లు చెల్లించింది. 2026 జనవరి నుంచి అద్దె 15 శాతం పెరుగుతుందని ఒప్పందంలో ఉంది.
హైదరాబాద్ లో ఐటీ జోన్ అంతా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపే ఉండటంతో ఇక్కడ అద్దెలకు డిమాండ్ ఎక్కువ. హైటెక్ సిటీలో సగటు అద్దె 2019లో నెలకు రూ.23 వేలు ఉండగా.. 2023 నాటికి దాదాపు రూ.27,500కి పెరిగింది. అలాగే, గచ్చిబౌలిలో అద్దెలు 2019లో రూ.22వేలు ఉండగా.. 2023లో నెలకు రూ.26,500కి పెరిగాయి. అలాగే కొండాపూర్‌లో అద్దెలు 19 శాతం పెరిగాయి. కాగా, ఆగస్టులో గూగుల్ హైదరాబాద్ లోని తన 3.7 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ని నెలకు రూ.2 కోట్ల అద్దెకు ల్యాండ్‌లార్డ్ మెగాసాఫ్ట్ లిమిటెడ్‌తో ఐదేళ్ల పాటు లీజుకు పునరుద్ధరించింది. ఇందుకోసం రూ.10.6 కోట్ల డిపాజిట్ చెల్లించింది. అలాగే క్వాల్‌కామ్ ఇండియా, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఎస్అండ్ పీ క్యాపిటల్ ఐక్యూ, ఐబీఎం వంటి ఎంఎన్ సీల నెలవారీ అద్దెలు రూ.70 లక్షల నుంచి రూ.3.15 కోట్ల మధ్య ఉన్నాయి.