ఆన్ లైన్ లో భవన నిర్మాణ అనుమతుల ద్వారా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కు రూ.110 కోట్ల ఆదాయం వచ్చింది. 2024-25లో 3,385 భవన నిర్మాణ అనుమతులను ఆన్ లైన్ ద్వారా ఆమోదించింది. తద్వారా రూ.110.25 కోట్లు ఆర్జించింది. అలాగే లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా 2,738 దరఖాస్తులను పరిష్కరించినట్టు జీవీఎంసీ మేయర్ జి.హరి వెంకట కుమారి, కమిషనర్ పి.సంపత్ కుమార్ తెలిపారు. ‘వీటిలో 2,686 కేసుల పరిష్కారం ద్వారా రూ.65.71 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే నగరంలో 84.84 కిలోమీటర్లకు సంబంధించి 15 మాస్టర్ ప్లాన్ల పనులు జరుగుతున్నాయి.
2024-25లో రూ.470 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, డిసెంబర్ వరకు రూ.284 కోట్లు వసూలైంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ ద్వారా ప్రాపర్టీ యజమానులు 5 శాతం రాయితీ కూడా పొందుతారు. దీనివల్ల ఒక్క ఏప్రిల్ లోనే జీవీఎంసీకి రూ.118.58 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త ప్రాపర్టీల అసెస్ మెంట్ల ద్వారా రూ.30 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది’ అని హరి కుమారి తెలిపారు. ఆస్తిపన్ను అందరూ సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు.
మురుగునీటి నిర్వహణ విషయంలో జీవీఎంసీ పనితీరును రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని సంపత్ కుమార్ వివరించారు. అక్టోబర్ 2న జీవీఎంసీకి స్వచ్ఛ భాగీదరి అవార్డును సీఎం చంద్రబాబు అందజేశారని తెలిపారు. అలాగే పీఎం స్వమిత్వ పథకం ద్వారా స్ట్రీట్ వెండర్లకు రుణాలు ఇచ్చే విషయంలో తొలి స్థానంలో ఉన్నట్టు చెప్పారు. విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడం కోసం జనవరి ఒకటో తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్టు స్పష్టం చేశారు.