- ముంబై వర్లీలో కొనుగోలు చేసిన మెట్రో బ్రాండ్స్
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో ఖరీదైన ప్రాపర్టీ డీల్ జరిగింది. వర్లీలోని ఓ విలాసవంతమైన ప్రాజెక్టులో ఐదు అపార్ట్ మెంట్లు రూ.405 కోట్లకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఫుట్ వేర్ రిటైలర్ మెట్రో బ్రాండ్స్ కి చెందిన ప్రమోటర్లు, కో ప్రమోటర్లు ఫరా భజ్నీ, షబీనా మాలిక్ హాది, జారా మాలిక్, అలీషా రఫిక్ మాలిక్, జియా మాలిక్ లాల్జీలు ఈ అపార్ట్ మెంట్లు కొనుగోలు చేశారు. ఇవన్నీ పలైస్ రాయల్ అనే లగ్జరీ ప్రాజెక్టులో ఉన్నాయి. వీటి మొత్తం కార్పెట్ ఏరియా 38,390 చదరపు అడుగులు. ఈ లావాదేవీలకు రూ.20 కోట్లకు పైగా స్టాంపు డ్యూటీ చెల్లించగా.. మొత్తం 20 కార్ పార్కింగులు అపార్ట్ మెంట్లతో పాటు వచ్చాయి. ఈ ప్రాజెక్టును వర్లీలోని హానెస్ట్ షెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది.
అలీషా మాలిక్, జియా మాలిక్ లాల్జీ డిసెంబర్ 20న ఐదు అపార్ట్ మెంట్లలో రెండింటిని రూ.162 కోట్లకు కొనుగోలు కొనుగోలు చేశారు. 7,687 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మొదటి అపార్ట్ మెంట్ ను జియా మాలిక్ డిసెంబర్‌లో రూ.81 కోట్లతో కొనుగోలు చేశారు. దీనికి 5 కార్ పార్కింగులు ఉన్నాయి. 7,672 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండో అపార్ట్ మెంట్ ను అలీషా మాలిక్ డిసెంబర్ 20న రూ.81 కోట్లకు కొనుగోలు చేశారు. దీనికి కూడా ఐదు కార్ పార్కింగులు వచ్చాయి.
7,687 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడో అపార్ట్ మెంట్ ను ఫరా భజ్ని డిసెంబరు 23న రూ.81 కోట్లకు కొనుగోలు చేశారు. షబీనా మాలిక్ హది 7,672 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అపార్ట్ మెంట్ ను డిసెంబర్ 24న రూ.81 కోట్లకు, జరా మాలిక్ డిసెంబర్ 26న రూ.81 కోట్లకు ఐదో అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశారు. వీటికి 10 కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి.