2030 నాటికి కొత్త గృహ యజమానుల్లో 60 శాతం వారే
జేఎల్ఎల్ నివేదిక అంచనా
రియల్ రంగంలో ఇప్పటికే తమ జోరు కొనసాగిస్తున్న మిలీనియల్స్, జెన్ జెడ్స్ దానికి ఇంకా వేగవంతం చేయనున్నారు. 2030 నాటికి కొత్తగా ఇల్లు కొనేవారిలో 60 శాతం వారే ఉంటారని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. 1980 నుంచి 1986 మధ్య జన్మించినవారిని మిలీనియల్స్ లేదా జనరేషన్ వై అని పేర్కొంటారు. 1987 నుంచి 2010 మధ్య పుట్టిన వ్యక్తులను జనరేషన్ జెడ్ గా పరిగణిస్తారు. రాబోయే రోజుల్లో రియల్ రంగంలో వీరిదే కీలక పాత్ర కానుంది. ఇప్పటికే రియల్ రంగంపై మంచి అవగాహన కలిగి తమ పెట్టుబడులను ఆ దిశగా మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి కొత్తగా ఇల్లుకొన్నవారిలో 60 శాతం ఈ రెండు తరాలే ఉంటాయని పేర్కొంటున్నారు. మరోవైపు పట్టణ గృహ యజమానుల రేటు కూడా క్రమంగా పెరుగుతోందని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది.
2020లో ఇది 65 శాతం ఉండగా.. 2025 నాటికి 72 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. వేగవంతమైన పట్టణీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతల వల్ల 2025 నాటికి భారతదేశ హౌసింగ్ మార్కెట్ అద్భుతమైన పరివర్తనకు సిద్ధంగా ఉందని జేఎల్ఎల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ రితేష్ మెహతా తెలిపారు. ఇక టైర్-2, టైర్-3 నగరాలు కీలకమైన వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. జైపూర్, ఇండోర్, కొచ్చి వంటి చిన్న పట్టణ కేంద్రాలు 2025 నాటికి 40 శాతానికి పైగా కొత్త గృహ నిర్మాణాలను కలిగి ఉంటాయని వివరించారు. 2025 నాటికి భారత గృహ నిర్మాణ రంగం జీడీపీలో 13 శాతం వాటా కలిగి ఉంటుందని జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. అలాగే 2030 నాటికి ఈ రంగం లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ గా వృద్ధి చెందడం ఖాయమని స్పష్టంచేసింది. జనాభా మార్పులు, విధాన సంస్కరణలు, ప్రపంచ పోకడలకు అనుగుణంగా ఈ రంగం అభివృద్ధి చెందుతోందని తెలిపింది.