సీఎం రేవంత్ నిర్ణయం.. 3 నెలల్లో డీపీఆర్
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఉండే ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యం ట్రాఫిక్‌తో సతమతమయ్యే కష్టాలు తీర్చేందుకు సిద్ధమైంది. మెట్రో విస్తరణలో భాగంగా నార్త్ సిటీ వైపు కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా డీపీఆర్ సిద్ధం చేయాలని మెట్రో ఎండీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వెంటనే డీపీఆర్‌లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్-2 ‘బి’లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. జనవరి 1, 2024న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్లకు డీపీఆర్ తయారీ విషయంలో చర్చించి సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్యారడైజ్- మేడ్చల్‌తోపాటు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్‌కు సంబంధించిన విస్తరణ విషయంపై కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం మెట్రో విస్తరణకు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసింది. ఫేజ్ -2 పేరుతో దీన్ని సిద్ధం చేసింది. అందులో దీన్ని కూడా ఇన్క్లూడ్ చేయాలని సూచించింది. గతంలో మల్కాజ్ గిరి ఎంపీగా పనిచేసిన తనకు ఆ ప్రాంత ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్ల రూట్ మ్యాప్‌లపై తనకు మంచి అవగాహన ఉందని సీఎం రేవంత్ చెబుతున్నారు. రూట్ మ్యాప్ గురించి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలను కూడా తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి మెట్రో ఎండీని ఆదేశించారు.
డీపీఆర్ తయారీని 3 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఎం సూచించినట్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాకు చెప్పారు. మెట్రో ఫేజ్-2 ‘ఏ’ భాగం లాగే ‘బి’ భాగాన్ని కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మెట్రో ఎండీ తెలిపారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు వెంటనే డీపీఆర్, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల రూపకల్పన మొదలుపెట్టినట్టు తెలిపారు.
దాదాపు 5 లక్షల మంది ప్రతిరోజూ మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం మూడు కాడిడార్లు ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో సేవలందిస్తోంది. మరింత విస్తరించేందుకు రెండో దశను ప్రాతిపాదించారు. కారిడార్ IVలో భాగంగా నాగోల్ -RGIA ఎయిర్ పోర్ట్ వరకు, కారిడార్ Vలో రాయదుర్గం -కోకాపేట్ నియోపోలిస్ వరకు, కారిడార్ VIలో ఎంజీబీఎస్ – చంద్రాయన్ గుట్ట వరకు, కారిడార్ VIIలో మియాపూర్ – పటాన్ చెరు వరకు, కారిడార్ VIIIలో ఎల్ బి నగర్ – హయత్ నగర్ వరకు, కారిడార్ IX RGIA – ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) వరకు నిర్మించాలని ఇప్పటికీ డీపీఆర్ రెడీ చేశారు. దీన్ని మేడ్చల్ వరకూ విస్తరించనున్నారు.