రియల్ ఎస్టేట్ కు ఆశాజనకంగా 2025
జోరుగా.. మరింత వృద్ధి
బాటలో పయనించే ఛాన్స్
దేశంలో రియల్ ఎస్టేట్ రంగం జోరు మరింత పెరుగుతుందని.. కొత్త ఏడాదిలో ఈ రంగం చక్కని వృద్ధి బాటలో పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరాల్లో సాగిన వృద్ధిని బట్టి డిమాండ్ కు అనుగుణంగా డెవలపర్లు కొత్త సరఫరా పెంచుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర బడ్జెట్ లో రియల్ రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాలు ఈ రంగం వృద్ధికి దోహదం చేస్తాయని అంటున్నారు. అలాగే కొత్త ఏడాదిలో రియల్ ధరలు కాస్త పెరుగుతాయని పేర్కొంటున్నారు.
వాస్తవానికి కరోనా మహమ్మారి తర్వాత 2024లో దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ అమ్మకాలు తొలిసారిగా తగ్గాయి. పెరిగిన ధరలు, రుణ ఖర్చులు కొనుగోలుదారుల ఉత్సాహాన్ని తగ్గించాయి. ఏడు ప్రధాన నగరాల్లో 2024లో విక్రయాల పరిమాణం 4 శాతం క్షీణించి 4,59,650 యూనిట్లకు చేరుకోగా, కొత్త సరఫరా 7 శాతం తగ్గి 4,12,520 యూనిట్లకు చేరుకుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. 2020లో 47 శాతం క్షీణత తర్వాత, గృహాల విక్రయాలు 2021, 2022, 2023లలో వరుసగా 71 శాతం, 54 శాతం, 31 శాతం పెరిగాయి. 2019లో గృహాల విక్రయాలు 2,61,355 యూనిట్లు ఉండగా.. కోవిడ్ కారణంగా తదుపరి సంవత్సరం 1,38,350 యూనిట్లకు విక్రయాలు పడిపోయాయి. తిరిగి 2021లో అమ్మకాలు 2,36,510 యూనిట్లకు, 2022లో 3,64,880 యూనిట్లకు, 2023లో 4,76,525 యూనిట్లకు పెరిగాయి. ఇదే విధంగా రియల్ రంగం పయనిస్తే 2024లోనూ విక్రయాలు పెరిగేవి. కానీ అధిక వడ్డీ రేట్లు, ధరల పెరుగుదల వంటి అంశాలు 4 శాతం క్షీణతకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో మళ్లీ రియల్ రంగం జోరు అందుకోవాలంటే ఆర్బీఐ రెపో రేటు తగ్గించాలని, రాబోయే కేంద్ర బడ్జెట్ లో స్థిరాస్తి రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బడ్జెట్ మీదే ఆధారం..
2025లో హౌసింగ్ మార్కెట్ స్థిరంగా పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. 2024లో ఇళ్ల ధరలు సగటున 21 శాతం పెరిగాయి. ఈ ఏడాది మరికొంత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, స్థిరాస్తి రంగం వృద్ధి.. రాబోయే యూనియన్ బడ్జెట్ లో ఏమి ఇస్తారనే అంశంపై ఆధారపడి ఉంటుంది. అనూజ్ పూరి, ఛైర్మన్, అనరాక్
వృద్ధి ఖాయం.. కానీ!
2025లో రియల్ ఎస్టేట్ రంగం నిరంతర వృద్ధిని సాధిస్తుందని అంచనా. ఈ ఊపు స్థిరమైన ఆర్థిక వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాలను బట్టి ఉంటుంది.- జి.హరిబాబు, నరెడ్కో జాతీయ అధ్యక్షుడు.
పరిశ్రమ హోదా ఇవ్వాలి
2025 బడ్జెట్‌ను సమీపిస్తున్నందున, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి ఉత్ప్రేరకాలుగా పని చేసే మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించే సంస్కరణల గురించి ఆశాజనకంగా ఉంది. పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు మరియు నిర్మాణ వ్యయాలకు అనుగుణంగా గృహ రుణాలపై ప్రస్తుత పన్ను మినహాయింపు పరిమితిని ₹5 లక్షలకు సవరిస్తే ఇంటి బయ్యర్లకు గణనీయ ఉపశమనం లభిస్తుంది. రియల్ ఎస్టేట్‌కు పరిశ్రమ హోదాను మంజూరు చేయడం సమానంగా రూపాంతరం చెందుతుంది, ఇది 200 అనుబంధ రంగాలను ఉత్తేజపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
రియల్ ఎస్టేట్ పరిశ్రమ వికసిత్ భారత్ 2047 వైపు భారతదేశం ప్రయాణంలో నిర్వచించే పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉంది. జీఎస్‌టీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ నిబంధనలకు సర్దుబాట్లు వంటి వ్యూహాత్మక సంస్కరణలు డెవలపర్‌ల పన్ను భారాన్ని తగ్గించగలవు, ప్రాపర్టీ ధరలను స్థిరీకరించగలవు మరియు గృహాలను మరింత అందుబాటులోకి తీసుకు రాగలవు. అదనంగా, ₹1 కోటి వరకు హౌసింగ్ లోన్‌ల కోసం ₹5 లక్షల సబ్సిడీని ప్రవేశపెట్టడం పట్టణ మరియు సెమీ-అర్బన్ గృహ కొనుగోలుదారులకు కీలకమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.- ప్రదీప్ అగర్వాల్. ఛైర్మన్, సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్