లేఅవుట్ల క్రమబద్ధీకరణ-ఎల్ఆర్ఎస్ అమలులో భాగంగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న అనధికార లేఆవుట్లు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో భాగంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేఅవుట్‌లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి.. మిగిలిన 90 శాతానికి రిజిస్టర్ కాకపోతే.. ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతో పాటు రిజిస్ట్రేషన్‌కి అవకాశం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారి చేసింది.
సంబంధిత ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ అధికారి కార్యాలయంలో నిర్ణీత ఫీజును చెల్లించి.. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. ఇలాంటి ప్లాట్లకు సంబంధించిన వివరాలను సబ్ రిజిస్ట్రార్ నిర్దేశిత ఫార్మాట్‌లో సేకరించి ప్రాసెసింగ్ కోసం ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌కు పంపిస్తారు. రిజిస్ట్రేషన్ చేసే ముందు సంబంధిత లేఅవుట్ లేదా అందులో ప్లాట్లు.. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌తో పాటు నిషేధిత జాబితా, ఇతర ఎలాంటి వివాదంలో లేవని నీటిపారుదల శాఖ, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు ఎన్‌వోసీ ఇవ్వాలి. దీన్నే లెవల్-1 అనుమతుల కేటగిరిగా భావిస్తారు. అక్రమ లేఅవుట్లను ఈ స్కీం కింద 31 మార్చి 2025 లోపు, అంతకు ముందు ఫీజు కట్టిన వారికి క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో 25 శాతం రాయితీనిస్తారు. ఇప్పటికే కొంత రుసుము చెల్లించిన వారు.. పెండింగ్ మొత్తంలో రాయితీని మినహాయించుకుని.. మిగతా సొమ్ము చెల్లించే అవకాశాన్ని కల్పించారు.
2020 సెప్టెంబరు 16న ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి సంబంధించి.. అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణ రుసుములపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 135 జారీ చేసింది. మార్కెట్ విలువలు, భూ విస్తీర్ణం ఆధారంగా ఈ పెనాల్టీ మారుతుంది. నేరుగా బిల్డింగ్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఎల్‌ఆర్‌ఎస్ పెనాల్టీతో పాటు 14 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీ, అదనంగా 33 శాతం కాంపౌండ్ పెనాల్టీ చెల్లించాలి. అదే ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకుంటే, ఈ 33 శాతం అదనపు పెనాల్టీ ఉండదు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎల్ఆర్ఎస్ కోసం.. మార్కెట్లో చదరపు గజం ధర రూ.3-5 వేల వరకు ఉంటే 30 శాతం.. రూ.5–-10 వేల మధ్య ఉంటే 40 శాతం.. రూ.10–20 వేల మధ్య ఉంటే 50 శాతం.. రూ.20-–30 వేల మధ్య ఉంటే 60 శాతం.. రూ.30–50 వేల మధ్య ఉంటే 80 శాతం.. చదరపు గజం రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే 100 శాతం చొప్పున ఎల్ఆర్ఎస్ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు హెచ్ఎండీఏ పరిధిలో 200 చదరపు గజాల స్థలం ఉందనుకోండి.. అక్కడ మార్కెట్ విలువ చదరపు గజానికి రూ. 5 వేల రూపాయలు ఉంటే అప్పుడు 200 చదరపు గజాల స్థలం విలువ రూ.10 లక్షల అవుతుంది. అంటే ఈ ప్లాటు మార్కెట్ విలువ 5 వేల రూపాయల లోపు ఉంది కాబట్టి ఇది 30 శాతం శ్లాబులోకి వస్తుంది. దీనిపై 30 శాతం క్రమబద్ధీకరణ ఫీజు రూ. 3 లక్షలు, దానిపై ఓపెన్ స్పేస్ ఛార్జీలు ప్రతి చదరపు అడుగుకి 0.14 శాతం (భూమి) వంతున 33.6 గజాలకు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక్కడ ఓపెన్ స్పేస్ రుసుము ప్రతి చదరపు గజానికి రూ.2 వేలు అనుకుంటే ఆ ఛార్జీలు రూ.67,200 వరకు అవుతుంది.
ఇలా మొత్తం క్రమబద్ధీకరణ ఫీజు రూ.3,67,200 గా లెక్కకడతారు.
ఇక మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ క్రింద క్రమబద్దీకరించుకుంటే ఇందులో 25 శాతం రాయితీ అంటే రూ.66,800 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రాయితీని మినహాయిస్తే.. రూ.3,00,400 లు చెల్లిస్తే సరిపోతుంది.