- నిర్మాణం పూర్తయినట్టు సర్టిఫికెట్టు లేకుండా వినియోగిస్తే జరిమానా
- నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం
భవనం నిర్మాణం పూర్తయినట్టు ధ్రువీకరించే సర్టిఫికెట్లు (ఓసీ) లేకుండా సదరు భవనాలను వినియోగించేవారిపై కొరడా ఝుళిపించాలని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. బీసీసీ లేకుండా భవనాలను వినియోగిస్తున్న వారి నుంచి జరిమానా వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 600 చదరపు అడుగుల లోపు నిర్మాణాలకు ఈ జరిమానాలు వర్తించవు. 601 చదరపు అడుగుల నుంచి 1000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ప్రాపర్టీల నుంచి వార్షిక ఆస్తిపన్నులో 50 శాతం జరిమానాగా విధించనున్నారు. ఓసీ తీసుకునే వరకు ఏటా ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 1001 చదరపు అడుగులు.. ఆపై విస్తీర్ణం ఉన్న నిర్మాణాల నుంచి వారు ఏటా చెల్లించే ఆస్తి పన్నుకు రెండింతల మొత్తాన్ని జరిమానాగా వసూలు చేయనున్నారు. నిబంధనల ప్రకారం ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బీసీసీలను పొందడం తప్పనిసరి. అయితే, చాలామంది వాటిని తీసుకోకుండానే వాటిలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఓసీలు తీసుకోకుండా వినియోగిస్తున్న ప్రాపర్టీలను పన్ను పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అలాంటి ప్రాపర్టీలన్నీ తమ నిఘా పరిధిలో ఉన్నాయని.. ఆ ప్రాజెక్టు ప్రారంభించడానికి సర్టిఫికెట్ ఇచ్చిన తేదీ నుంచి జరిమానా వసూలు చేస్తామని స్పష్టంచేశారు. బీసీసీలు లేకుండా వినియోగిస్తున్న భవనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం కొంచె కష్టమేనని.. అయితే, 20వేలకు పైగా అలాంటి భవనాలు ఉన్నాయని భావిస్తున్నట్టు చెప్పారు. వాటన్నింటి నుంచి జరిమానా వసూలు చేస్తామని పేర్కొన్నారు.