- ప్రీలాంచ్ బిల్డర్లను అరెస్టు చేయాలి
- ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ వింగ్ ఏర్పాటు చేయాలి
- సోషల్ మీడియా ఆఫర్లపై దృష్టి పెట్టాలి
- ఫీల్డ్‌కు వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలి
కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం.. జిల్లా కలెక్టరే పూర్తి స్థాయి బాస్. ఆయన ఆధ్వర్యంలోనే లేఅవుట్లు, అపార్టుమెంట్లకు అనుమతుల్ని మంజూరు అవుతాయి. పోలీసు, మున్సిపల్, రెవెన్యూ వంటివన్నీ కలెక్టర్ నేతృత్వంలో పని చేస్తాయి. అందుకే, జిల్లా బాస్ నేతృత్వంలో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి. విచ్చలవిడిగా పెరిగిపోతున్న యూడీఎస్ మరియు ప్రీలాంచ్ ప్రాజెక్టుల్ని నిరోధించాలంటే కఠినంగా వ్యవహరించాలి.
ప్రతి జిల్లాలో ఎన్ఫోర్స్‌మెంట్ అథారిటీ జిల్లా కలెక్టర్ కాబట్టి.. సోషల్ మీడియాలో ప్రీలాంచ్, యూడీఎస్ ఆఫర్ల మీద ఫోకస్ పెట్టాలి. ఆయా నెంబర్లకు కాల్ చేసి వారి వివరాలు సేకరించాలి. వీలైతే ప్రాజెక్టు వద్దకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని.. అందుకు బాధ్యుడైన వ్యక్తి లేదా వ్యక్తుల్ని అరెస్టు చేయాలి. ఇలా తెలంగాణలోని జిల్లా కలెక్టర్లందరూ కట్టుదిట్టంగా వ్యవహరిస్తే తప్ప.. రాష్ట్రంలో యూడీఎస్, ప్రీలాంచ్ మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
కేవలం హైదరాబాదే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో యూడీఎస్, ప్రీలాంచ్ మోసాలు పెరిగిపోయాయి. మేడ్చల్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ వంటి ప్రాంతాల్లో ఈ తరహా మోసగాళ్లు పెరిగిపోయారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి, డీటీసీపీ అనుమతి తీసుకోకుండా.. రెరా అనుమతి లేకుండానే.. కొందరు రియల్టర్లు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. రేటు తక్కువ అంటూ అమాయకుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చదరపు అడుక్కీ రూ.1500.. మరికొన్ని ప్రాంతాల్లో రూ.1800.. ఇంకొన్ని ఏరియాల్లో 2000 నుంచి 2200 మధ్యలో అమ్ముతున్నారు. కేవలం రేటు తక్కువ అనే ఒక్క కారణం వల్ల బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అంతే తప్ప, ఆయా డెవలపర్లకు నిర్మాణాలు చేపట్టడంలో గత అనుభవం ఉందా? ఇప్పటిదాకా ఎన్ని అపార్టుమెంట్లను పూర్తి చేశారు? వారికి సకాలంలో ఫ్లాట్లను అప్పగించిన చరిత్ర ఉందా? వాళ్లు నిర్మించిన ఫ్లాట్లలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కొనుగోలుదారులు నివసిస్తున్నారా? ఆయా నిర్మాణాల్ని నాణ్యతగా కట్టించారా? ఇలాంటి అనేక అంశాల్ని గమనించాకే బయ్యర్లు ఫ్లాట్ కొనుగోలులో తుది నిర్ణయం తీసుకోవాలి.