-
- ఆర్థిక మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందుతోందో క్రెడాయ్ గ్రోత్ కూడా అలాగే ఉండటం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. హెచ్ఐసీసీలో జరిగిన క్రెడాయ్ తెలంగాణ క్రియేట్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. గతంలో క్రెడాయ్ కి 10 చాప్టర్లు ఉండగా.. ఇప్పుడు అవి 15కి పెరిగాయన్నారు. వ్యాపారం అనేది హైదరాబాద్ లోనే కాదని. జిల్లాల్లో కూడా పెరుగుతోందన్నారు. కొత్తగా ఉద్యోగం కావాలని కోరుకునేవారి మొదటి ప్రాధాన్యత హైదరాబాద్కే ఇస్తున్నారని సర్వేలో తేలిందన్నారు. చక్కని పరిపాలనతో పాటు ఎన్నో మంచి అంశాలు ఇక్కడ ఉండటం వల్లే అందరూ హైదరాబాద్ వైపు చూస్తున్నారని తెలిపారు. ఇంకా, ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘‘ ఏ రంగంలో చూసినా హైదరాబాద్ అద్భుతమైన గ్రోత్ నమోదు చేసుకుంది. కొత్త రాష్ట్రమైనా దేశానికి దిక్సూచిగా నిలిచాం. ఇక కరోనా సమయంలో కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దేశానికి ఆదర్శంగా ఉంది. అందరికంటే ముందుంది. దీనికి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణం. రియల్ ఎస్టేట్ విషయంలో హైదరాబాద్ బెస్ట్ అని ఓ బిల్డర్ స్వయంగా నాకు చెప్పారు. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏ రంగంలో చూసినా హైదరాబాద్ బెస్ట్ అని పలు గణాంకాలే చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు మన తలసరి ఆదాయం రూ.1,24,100 ఉండగా.. ఏడేళ్ల తర్వాత రూ.2,37,632 అయింది. అదే దేశం యొక్క తలసరి ఆదాయం రూ.1,28,829. అంటే దేశం యొక్క తలసరి ఆదాయం కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ. అలాగే తలసరి విద్యుత్ వినియోగం విషయంలో దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ కాగా, దేశంలో చూస్తే రెండో స్థానంలో ఉన్నాం. తెలంగాణ వస్తే భూములు ధరలు పడిపోతాయన్నారు.. కరెంటు ఉండక చీకటవుతుందన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు. ఇక్కడ ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో మూడు ఎకరాలు వస్తుంది. అప్పట్లో ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే ఇక్కడ మూడు ఎకరాలు వచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు జిల్లాల్లో కూడా బాగా విస్తరణ పెరుగుతోంది. వ్యవసాయం కూడా అభివృద్ధి చెందుతోంది. రైతుల దగ్గర డబ్బులు ఉంటున్నాయి. అందుకే మీ చాప్టర్లు కూడా పెరుగుతున్నాయి. సేవింగ్స్ విషయంలో ప్రజల ఆలోచనలో మార్పులు వస్తున్నాయి. గతంలో బంగారం కొనుక్కోవాలని, బ్యాంకులో దాచుకోవాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు ప్లాట్ కొనుక్కోవాలని, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. ఇక మీరు మా దృష్టికి తీసుకొచ్చిన ధరణి, టీఎస్ బీపాస్ సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తాం.
ఐటీ రంగంలో కూడా తెలంగాణ దూసుకుపోతోంది. తెలంగాణ ఏర్పడిననాడు ఐటీ రంగంలో 3,23,398 మంది ఉద్యోగులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. జిల్లాల్లో కూడా ఐటీ విస్తరణ జరుగుతోంది. ఐటీ రంగంలో దేశంలోని ప్రతి పది ఉద్యోగాల్లో మూడు హైదరాబాద్ లోనే వస్తున్నాయి. చివరగా ఒక మాట. విలువలు పాటించండి. నమ్మకాన్ని పెంచుకోండి. డబ్బులు అశాశ్వతమైనవి. నమ్మకం, విలువలు శాశ్వతమైనవి. రాబోయే తరాలకు కూడా మంచి పేరును ఇచ్చే ప్రయత్నం చేయండి. కరోనా కారణంగా ప్రజల ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. అపార్ట్ మెంట్లో ఉన్నవారు కూడా తమ ఫ్లాట్ లోకి గాలి, వెలుతురు రావాలని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే మీరు పని చేయండి.’’