poulomi avante poulomi avante

ప్రీలాంచ్ సంస్థలకు ప్రాపర్టీ షోలో నో ఎంట్రీ?

  • ప్రీలాంచ్ సంస్థలు, రెరా కంపెనీలకు ఒకే ప్రదర్శనలో స్థానం కల్పిస్తారా?
  • క్రెడాయ్ నిర్ణయం వైపుప్రభుత్వం, బయ్యర్ల చూపు
  • క్రెడాయ్ హైద‌రాబాద్ 11వ ఎడిష‌న్ స్థిరాస్తి ప్ర‌ద‌ర్శ‌న‌
  • ఫిబ్ర‌వ‌రి 11 నుంచి 13 దాకా..

గత ఆగస్టులో 10వ ఎడిషన్ ప్రాపర్టీ షోను నిర్వహించి.. మళ్లీ వచ్చే నెల మరో ప్రాపర్టీ షోను అట్టహాసంగా నిర్వహించేందుకు క్రెడాయ్ హైదరాబాద్ ఉవ్విళ్లూరుతోంది. ప్రాపర్టీ షోల నిర్వహణలో ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా వ్యవహరించే ఈ సంఘం.. నిర్మాణ రంగం భవిష్యత్తును కబళించి వేసేందుకు కరోనాతో పోటీ పడుతున్న యూడీఎస్, ప్రీలాంచుల్ని అరికట్టేందుకు ఎందుకు పక్కా ప్రణాళికల్ని రచించట్లేదు? ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, పొరుగు రాష్ట్రంలో అనిశ్చితి వ‌ల్ల.. మ‌న నిర్మాణ రంగం మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కానీ, కొంద‌రు అక్ర‌మార్కుల వ‌ల్ల నిర్మాణ రంగం దెబ్బ‌తినే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న విష‌యం ఇప్ప‌టికీ క్రెడాయ్ హైద‌రాబాద్‌కి అర్థం కావ‌ట్లేదా? ఒక‌వేళ అర్థ‌మైనా.. మ‌న‌కెందుకులే అని చేతులు దులిపేసుకుంటున్నారా? ప్రీలాంచ్ సంస్థ‌ల్ని ప్రాప‌ర్టీ షోలో పాల్గొన‌కుండా నిషేధం విధిస్తుందా? అక్రమంగా ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల్ని విక్రయించే సంస్థ‌ల‌కు అడ్డుక‌ట్ట వేస్తుందా?

టీఎస్ రెరా అనుమ‌తి పొందిన ప్రాజెక్టులకు మాత్ర‌మే ప్ర‌దర్శ‌న‌లో స్థానం క‌ల్పిస్తామ‌ని క్రెడాయ్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు రామ‌కృష్ణారావు ప‌త్రికా స‌మావేశంలో వెల్ల‌డించారు. కానీ, కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు ఏం చేస్తున్నారంటే.. ముందుగా ప్రీలాంచ్‌, యూడీఎస్‌లో ప్లాట్లు, ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నారు. త‌మ‌కు కావాల్సిన సొమ్మును స‌మీక‌రించుకున్నాక‌.. కొనుగోలుదారులు ఒత్తిడి పెడితే ప్ర‌భుత్వ అనుమ‌తుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో, కొన్ని సంస్థ‌ల వ‌ల్ల యూడీఎస్‌, ప్రీలాంచుల‌తో పాటు రెరా అనుమ‌తి పొందిన ప్రాజెక్టుల్ని విక్రయిస్తున్నారు. మ‌రి, ఇలాంటి సంస్థ‌ల‌ను ప్రాప‌ర్టీ షోలో పాల్గొన‌కుండా ప్ర‌త్యేక వ్యూహం ఏమైనా ర‌చిస్తున్నారా?

ప్రాప‌ర్టీ షోలో ప్ర‌ద‌ర్శిస్తారా?

క్రెడాయ్ హైదరాబాద్ నాయకత్వం గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఏ నిర్మాణ సంస్థా ఇలాంటి ప్రదర్శనలో ప్రీలాంచ్, యూడీఎస్ విధానంలో బ‌హిరంగంగా ఫ్లాట్లను విక్రయించదు. రెరా అనుమతి పొందిన ప్రాజెక్టుల్ని మాత్ర‌మే ప్ర‌ద‌ర్శిస్తుంది. రెరా ప్రాజెక్టుల్ని ప్రదర్శిస్తామని నిర్మాణ సంస్థలు క్రెడాయ్ హైదరాబాద్ కి డిక్లరేషన్ ను రాసిస్తాయా? లేదా ప్రతి సంస్థ రెరా ప్రాజెక్టుల గురించే సందర్శకులకు చెబుతున్నారా? లేదా? అని ఎప్పటికప్పుడు నిఘా పెడతారా? యూడీఎస్, ప్రీలాంచ్ ఆప్షన్ల గురించి సంస్థ ప్రతినిధులు సందర్శకులకు త‌ప్ప‌కుండా వివరిస్తారు. లేదా ఆతర్వాతనైనా వారికి సమాచారం ఇస్తారు. ఉదాహరణకు, చెన్నైకి చెందిన అల‌యాన్స్ గ్రూపున‌కు చెందిన అర్బ‌న్ రైజ్ వంటి సంస్థ హైదరాబాద్లో ఏజెంట్ల‌కు భారీ స్థాయిలో న‌జ‌రానా అందించి రెరా అనుమ‌తి కంటే ముందే ఫ్లాట్ల‌ను విక్ర‌యించింది. రెరా కంటే ముందు 23 అంత‌స్తులు క‌డ‌తామ‌ని చెప్పి ఆ తర్వాత అపార్టుమెంట్ ఎత్తును 33 అంతస్తులకు పెంచేసింది. ఇప్పుడేమో రెరా అనుమ‌తి తీసుకుంది. పీవీఆర్ డెవలపర్స్ సంస్థ కూడా యూడీఎస్, ప్రీలాంచ్ కు పెట్టింది పేరు. మ‌రి, ఇలాంటి సంస్థలను ప్రాపర్టీ షో లో పాల్గొనకుండా క్రెడాయ్ హైదరాబాద్ నిలువ‌రిస్తుందా?

ద్వంద్వ నీతి ఎందుకు?

వాసవి, సాహితీ తదితర సంస్థల గురించి తెలిసిందే. ఈ రెండు సంస్థలు యూడీఎస్, ప్రీలాంచ్లో ఎక్కువగా ఫ్లాట్లను విక్రయిస్తున్నాయని.. టీవీ 9 కొంతకాలం క్రితం వరుస కథనాల్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఇదే కోవలోకి ఈఐపీఎల్ గ్రూప్, ఐరా రియాల్టీ వంటి సంస్థలూ వస్తాయి. మరి, ఇలాంటి కంపెనీలు ఒకవైపు.. రెరా అనుమతి పొందిన సంస్థల్నీ మరోవైపు.. ప్రాప‌ర్టీ షోలో ప్రదర్శనకు ఉంచి.. క్రెడాయ్ హైదరాబాద్ ఏం సాధించే ప్రయత్నం చేస్తోంది? అటు ప్రభుత్వానికి కానీ ఇటు కొనుగోలుదారులకు కానీ ఎలాంటి సందేశం ఇస్తోంది? తాము యూడీఎస్, ప్రీలాంచులకు వ్యతిరేకమని ప్రచారం నిర్వహిస్తూనే.. ఆయా సంస్థలను క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో పాల్గొనేందుకు ఎందుకు స్థానం కల్పిస్తోంది? ఇలా ద్వంద్వ ప్రమాణాల్ని ఎందుకు పాటిస్తోంది? ఇప్ప‌టికైనా, క్రెడాయ్ నాయ‌క‌త్వం కాస్త తెలివిగా ఆలోచించి.. యూడీఎస్‌, ప్రీలాంచ్ సంస్థ‌ల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన‌కుండా చేయాలి. అప్పుడే, క్రెడాయ్ హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ మ‌రింత రెట్టింపౌతుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles