-
- ఎంతమంది రియల్టర్లు, బిల్డర్లకు నోటీసులు?
- జరిమానా వసూలు చేసింది ఎంత?
- రెరా వయోలేటర్ల పేర్లను పేపర్లో వెల్లడించాలి
- జీహెచ్ఎంసీలో బిల్డర్ల సభ్యత్వాన్ని రద్దు చేయాలి
- రెరా నోటీసుకు స్పందించకపోతే జైల్లో పెట్టాలి
డిజిటల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రీలాంచ్ ప్రాజెక్టులే! రేటు తక్కువ అంటూ మోత మోగిస్తున్నారు. వెంటనే కొనకపోతే గొప్ప అవకాశం కోల్పోతామనే భ్రమ కల్పిస్తున్నారు. అది నిజమేనని నమ్మేసి కొందరు బయ్యర్లు తమ కష్టార్జితాన్ని వారి చేతిలో పెడుతున్నారు. ఇలా, మూడేళ్ల క్రితం సొమ్ము కట్టినా ఆరంభం కాని నిర్మాణాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకం ఉన్నాయి. అందులో కొన్న కొనుగోలుదారులు ప్రస్తుతం లబోదిబో మంటున్నారు. నోరు తెరిచి బయటెవ్వరికీ ఫిర్యాదు చేయలేరు. అలా చేస్తే.. బిల్డర్ ఇవ్వాల్సిన డబ్బులూ ఇవ్వడని భయపడుతున్నారు. ఒకవేళ చెప్పినా, రెరా అథారిటీ రక్షణ కల్పించే అవకాశమే లేదు. దీంతో, రెరా అనుమతి లేని ప్రాజెక్టుల్లో కొన్నవారంతా అడ్డంగా ఇరుక్కుపోయారు. మరి, రెండు మూడేళ్ల నుంచి కొనుగోలుదారుల్నుంచి సొమ్ము వసూలు చేస్తున్న సంస్థల్లో ఎన్నింటికి రెరా అథారిటీ నోటీసుల్ని జారీ చేసింది? ఇప్పటివరకూ ఎంత మంది నుంచి జరిమానా వసూలు చేసింది? ఇందుకు సంబంధించి ఇప్పటికైనా రెరా అథారిటీ బహిరంగ ప్రకటన విడుదల చేస్తే.. వారి మాయలో కొత్త కొనుగోలుదారులు పడే అవకాశం ఉండదు.
సభ్యత్వాన్ని రద్దు చేయాలి
మోసపూరిత డెవలపర్ల నుంచి అమాయక కొనుగోలుదారుల్ని రక్షించాలన్న ఉన్నతమైన లక్ష్యంతోనే రెరా అథారిటీ ఏర్పాటైంది. దీనికి మొదట్లో అధిక ప్రాధాన్యతనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆతర్వాత ఎందుకో కానీ పట్టించుకోవడం మానేసింది. కొనుగోలుదారుల్ని మోసం చేస్తున్న బిల్డర్ల సభ్యత్వాన్ని రద్దు చేయమని జీహెచ్ఎంసీ తదితర స్థానిక సంస్థలకు రెరా అథారిటీ లేఖ రాయాలి. అప్పుడు కానీ ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయలేం. అలా సభ్యత్వాన్ని రద్దు చేసిన బిల్డర్ల ఫోటోలను పత్రికల్లో ప్రకటించాలి.
నోటీసులు ఎంతమందికి?
ఇప్పటివరకూ తెలంగాణ రెరా అథారిటీ దాదాపు యాభై మంది ప్రమోటర్లకు నోటీసుల్ని జారీ చేసిందని సమాచారం. స్వయంగా రెరా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాల్ని సేకరించారు. కొందరు బిల్డర్లు రెరా నోటీసుకు తెలివిగా సమాచారం ఇస్తున్నారని తెలిసింది. హెచ్ఎండీఏ లేదా ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అనుమతులు ఆలస్యం అవుతున్నాయని రెరాకు సమాచారం ఇస్తున్నారని సమాచారం. ఇలాంటి కట్టుకథలు చెప్పినా రెరా అథారిటీ పెద్దగా నమ్మదనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే, స్థానిక సంస్థల నుంచి అనుమతి వచ్చిన తర్వాత రెరాలో నమోదు చేసుకున్నాకే.. ఏ ప్రమోటర్ అయినా అమ్మకాలు చేపట్టాలనేది నిబంధన. అనుమతుల్లో ఆలస్యం కావడం వల్లే రెరా వద్దకు రాలేదని సమాధానం ఇస్తే.. ఆయా సంస్థ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే. ఆయా సంస్థలు రెరాకు అనుమతికోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే పది శాతం జరిమానాను ముక్కుపిండి వసూలు చేస్తారు.
రెరా నోటీసులిచ్చినా స్పందించని ప్రమోటర్లపై క్రిమినల్ కేసుల్ని ఎందుకు పెట్టకూడదు? ఆయా బిల్డర్లకు ఎందుకు జైలులో పెట్టరు? ఇలాంటి వారు సకాలంలో స్పందించడం లేదంటే.. రెరా అథారిటీని పట్టించుకోవడం లేదనే కదా? రానున్న రోజుల్లో ఇక్కడ్నుంచి బిచాణా ఎత్తివేసే ఆలోచనలున్న వారే కదా రెరాను బేఖాతరు చేస్తున్నారు. కాబట్టి, ఇప్పటికైనా ఇలాంటి మోసపూరిత ప్రమోటర్లపై పోలీసు కేసులు పెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని అధిక శాతం మంది డెవలపర్లు కోరుతున్నారు.