గతంలో కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన రియల్ భూమ్.. ఇప్పుడు చిన్న చిన్న ఊళ్లకు సైతం విస్తరించింది. ఆ ఊరిలో అది వస్తోంది.. ఈ ఊరిలో ఇది రాబోతోందనే ప్రచారం చేయడం.. ఆపై నెమ్మదిగా వెంచర్లు వేసి కొనుగోలుదారులకు బురిడీ కొట్టడం కామనైపోయింది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పుణ్యమా అని ఆ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రాగా.. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీజడల రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా రియల్టర్లకు వరంగా మారింది.
యాదాద్రి తర్వాత సీఎం కేసీఆర్ ఈ ఆలయాన్నే అభివృద్ధి చేయనున్నారనే ప్రచారాన్ని ముమ్మరం చేయడం ద్వారా పలువురి దృష్టి అక్కడ పడేలా చేశారు. నీలగిరి అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీ (నూడా) ఏర్పాటు ఇందులో భాగమనే ప్రచారం విస్తృతం చేశారు. రియల్ భూమ్ పెంచడానికే ఇలా చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆలయం చుట్టూ పుట్టగొడుగుల్లా వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఏడాది క్రితం అక్కడ గజం రూ.4వేల లోపే ఉండగా.. ప్రస్తుతం దానిని రూ.8వేలు చేసేశారు. ప్రస్తుతం చెర్వుగట్టు చుట్టూ దాదాపు 20 వెంచర్లు వెలిశాయి. వేటికి అనుమతులు ఉన్నాయో, వేటికి లేవో ఏమీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు వాటన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.