- ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా.. వ్యవసాయ భూముల్ని ప్లాట్లుగా అమ్మకం
- లేఅవుట్లు వేస్తూ.. గుంటల్లో విక్రయాలు
- పేరుకు ఫామ్ ప్లాట్లు.. రిజిస్ట్రేషన్ గుంటల్లో
- గుంట స్థలానికైనా రైతుబంధు వస్తుందట
- ప్లాటు కొన్నాక మరణిస్తే రైతుబీమా ఇస్తారట
- ప్రభుత్వ పథకాల్ని వదిలిపెట్టని అక్రమార్కులు
- గుంటల్లో రిజిస్ట్రేషన్ చేయొద్దని చెబుతున్నా పట్టించుకోని సబ్ రిజిస్ట్రార్లు
హైదరాబాద్ నలువైపులా రియల్ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వ్యవసాయ భూముల్ని.. పనికి రాని స్థలాల్ని.. ల్యాండ్ కన్వర్షన్ (భూమార్పిడి) చేయకుండానే.. వాటిని లేఅవుట్లుగా చూపెడుతూ.. ప్లాట్లు విక్రయిస్తున్నారు. వీటికి ముద్దుగా ఫామ్ ప్లాట్లు అని పేరు పెట్టి.. తెలివిగా గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కేవలం నామమాత్రపు ఛార్జీలతోనే ఎకరాల కొద్దీ భూమి ఒకరి పేరు నుంచి మరొకరి పేరు మీదికి బదిలీ అవుతోంది. హెచ్ఎండీఏ, డీటీసీపీ, స్థానిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అనుమతుల్ని తీసుకోకుండా పలువురు రియల్టర్లు ఈ దందాను యధేచ్చగా జరుపుతున్నారు. పంచాయతీల నుంచి పాత తేదీల అనుమతితో కొందరు ఈ దందాను నడిపిస్తుంటే.. మరికొందరేమో స్థానిక సంస్థల్నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఇబ్బడిముబ్బడిగా అమ్మేస్తున్నారు.
స్థానిక సంస్థల నుంచి ఎలాంటి అనుమతుల్ని తీసుకోకుండా.. అక్రమంగా ప్లాట్లను విక్రయించే రియల్టర్ల సంఖ్య అధికమైంది. విషయమేమిటంటే.. పొరుగు రాష్ట్రానికి చెందిన కొందరు రియల్టర్లు ఇలాంటి మోసాలకు తెగిస్తున్నారు. ఈ ప్లాట్లకు రైతుబంధు, రైతు బీమాల పేర్లను విచ్చలవిడిగా వాడుకుంటూ అక్రమ దందాకు తెర లేపారు. పచ్చటి పొలాలతో పాటు పనికి రాని పోరంబోకు స్థలాల్లో లేఅవుట్లను వేస్తూ.. అందులో ప్లాట్లు కొంటే రైతుబంధు కూడా వస్తుందంటూ విక్రయిస్తున్నారు. ఆ ప్లాట్లను కొన్న వ్యక్తులు మరణిస్తే రైతుబీమా కూడా అందుకోవచ్చని చెబుతున్నారు. ఇంత బహిరంగంగా ఫామ్ ప్లాట్లను అమాయకులకు అంటగడుతున్నా స్థానిక సంస్థలు కానీ రెరా యంత్రాంగం కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు.
గుంట రూ.50 వేలు..
కొందరు రియల్టర్లు 121 గజాల స్థలం యాభై వేలకు అమ్మితే.. మరికొందరు లక్షకు అమ్ముతున్నారు. ఇంకొందరు రెండు నుంచి మూడు లక్షలకూ విక్రయిస్తున్నారు. ప్రాంతం బట్టి రేటు పెరుగుతుంది. వాస్తవానికి, లేఅవుట్లను వేయాలంటే ముందుగా నాలా ఛార్జీలను చెల్లించి స్థానిక సంస్థతో పాటు రెరా అనుమతి తీసుకోవాలి. ఇది ఖర్చుతో కూడుకున్న పని అని భావించి కొందరు రియల్టర్లు ఇలా అక్రమ రీతిలో ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇలాంటి అక్రమ దందా వల్ల ప్రభుత్వ ఆదాయమెంతో కోల్పోతుంది. నాలా ఛార్జీలు, అనుమతులకు ఫీజులు, ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ వంటి ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మరి, ఇంత ఆదాయం కోల్పోతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో?
600 ఎకరాల్లో ఫామ్ లేఅవుట్!
జనతా ఎస్టేట్స్ అనే సంస్థ.. జిల్ జిల్ జిగా పేరిట ఫామ్ ప్లాట్లను విక్రయిస్తోంది. ఈ సంస్థ బ్రోచర్ చూస్తే విస్తుపోవాల్సిందే. నారాయణఖేడ్ వద్ద దాదాపు ఆరు వందల ఎకరాల్లో వెంచర్ ఆరంభించామని సంస్థ చెబుతోంది. ఆరు వందల ఎకరాల్లో ఫామ్ లేఅవుట్ అభివృద్ధి చేస్తుంటే.. దీనికి డీటీసీపీ అనుమతి అవసరం లేదా? రెరా అనుమతి తీసుకోనక్కర్లేదా? ఈ సంస్థ బ్రోచర్ చూస్తుంటే.. ఒక్కో ఎకరం రూ.38.40 లక్షల చొప్పున విక్రయిస్తున్నారని అర్థమవుతోంది. ఈ లెక్కన ఆరు వందల ఎకరాల్ని అమ్ముతోందంటే.. వెంచర్ మొత్తం విలువ దాదాపు రెండు వేల కోట్లను దాటుతోంది. మరి, ఇంతంటి బడా వెంచర్ అభివృద్ధి చేసేటప్పుడు.. స్థల మార్పిడి, అనుమతులు, రిజిస్ట్రేషన్ ఛార్జీల ఆదాయం ప్రభుత్వానికి రావాలి కదా? ఇలాంటి అనేక సంస్థలు ఇలాగే వందల ఎకరాల్లో ఫామ్ లేఅవుట్లను డెవలప్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి. అయినా, ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తోంది.
ట్రిపుల్ ఆర్.. టీఆర్ఎస్ నేతల హస్తం! (బాక్స్)
ఆర్ ఆర్ ఆర్ ప్రకటన వెలువడిన తర్వాత ఈ తరహా మోసాలకు హైదరాబాద్ కేంద్రబిందువుగా మారింది. ఈ తతంగంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం కూడా ఉందని డెవలపర్లు అంటున్నారు. ప్రతి ప్రాంతంలో వారికి తెలియకుండా ఈ మోసం జరిగే అవకాశమే లేదని చెబుతున్నారు. ఫామ్ ప్లాట్ల పేరిట కొందరు అక్రమార్కులు నిషేధిత జాబితాలో ఉన్న భూములను సైతం అమ్మేస్తున్నారు. 111 జీవో ప్రాంతాల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. చెరువులు, కుంటల్ని కూడా వదలడం లేదు. ఎనిమిది కంటే ఎక్కువ మందికి విక్రయిస్తున్నారు కాబట్టి, తప్పనిసరిగా రెరా అనుమతి వీటికి ఉండాల్సిందే. కానీ, వీరేమాత్రం పట్టించుకోవడం లేదు. అధిక శాతం తెలంగాణ రాష్ట్రమంతా డీటీసీపీ పరిధిలోకి వస్తుంది. అయినా పావు ఎకరం నుంచి ఎకరం చొప్పున అమ్ముతున్నారు.