మార్కెట్ విలువల పెంపుదలపై నిర్మాణ సంఘాల అభ్యంతరం
పెంపుదలలో హేతుబద్ధత ఎక్కడుంది?
ఇప్పటికే ప్రజలపై అధిక భారం వేశారు
రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేశారు
యూడీఎస్, ప్రీలాంచుల్ని నిరోధించడంలో విఫలమయ్యారు
కొవిడ్ సమయంలో ఇలాంటి నిర్ణయమా?
ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునేటప్పుడు అనేక రకాలుగా ఆలోచించాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే ప్రజలు హర్షిస్తారు. మార్కెట్ సానుకూలంగా ఉన్నప్పుడు ఎలాంటి ఛార్జీలు పెంచినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, కరోనా వంటి విపత్కర సమయాల్లో భూముల మార్కెట్ విలువల్ని పెంచాలనుకోవడం సమంజసం కాదని నిర్మాణ సంఘాలు అంటున్నాయి. స్టేక్ హోల్డర్లు, పౌరుల అభిప్రాయాల్ని తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదని చెబుతున్నాయి. అందుకే, ఈ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేయాలని క్రెడాయ్ తెలంగాణ, ట్రెడా, క్రెడాయ్ హైదరాబాద్ నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి. ఎందుకో తెలుసా?
స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖ.. 2021 జులై 22 నుంచి కన్వేయన్స్ డీడ్లపై స్టాంప్ డ్యూటీని 37.5% పెంచింది. ఇది గతంలో 4 శాతముంటే.. 5.5 శాతానికి పెంచారు. తద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీల భారాన్ని 25% పెంచారు. గతంలో ఆరు శాతం ఉన్న ఛార్జీలను ఏడున్నర శాతానికి తీసుకొచ్చారు. ఇదే క్రమంలో వ్యవసాయ భూములు మరియు అన్ని ఆస్తుల మార్కెట్ విలువలు 30% నుండి 100% శాతం పెరిగాయి. జీహెచ్ఎంసీ పరిధిలో నాలా ఛార్జీలు 50 శాతం పెరిగాయి. గతంలో ఈ శాతం రెండు ఉండగా దానిని ప్రస్తుతం మూడు శాతానికి పెంచారు. ఇతర ప్రాంతాల్లో 67 శాతం పెంచారు. పైగా, గత నాలుగైదు నెలల్నుంచి రియల్ ఎస్టేట్ రంగం నిస్తేజంగా ఉన్న మాట వాస్తవమే. ప్రీ-లాంచ్ / డిస్కౌంట్ సేల్స్ వల్ల రియల్ రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో మళ్లీ మార్కెట్ విలువల్ని పెంచితే సరికొత్త సవాళ్లు ఏర్పడటంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా దెబ్బతింటుంది.
కొవిడ్-19 వేరియంట్ ఓమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో అధిక శాతం కార్యాలయాలు అతి తక్కువ సిబ్బందితో పని చేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇళ్ల కొనుగోలుదారులు హోమ్ లోన్ ప్రక్రియను వాయిదా వేస్తున్నారు. కొందరేమో ఆలస్యం చేస్తున్నారు. ఒమిక్రాన్ కారణంగా రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయి. తెలంగాణలో అధిక శాతం మంది.. డిసెంబర్ మరియు జనవరి నెలల్లో ఇంటికి సంబంధించిన లావాదేవీలను జరిపేందుకు అశుభంగా పరిగణిస్తారు. ఈ కారణంగా సంక్రాంతి పండుగ దృష్ట్యా రిజిస్ట్రేషన్లు చాలా వరకూ నిలిచిపోయాయి. పైగా, 2022 ఆర్థిక సంవత్సరం 2 నెలల్లో ముగుస్తుంది. ఈ సమయంలో పన్ను చెల్లింపులకు సంబంధించిన నిధుల గురించి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. దీనికి తోడుగా ఫిబ్రవరి 1 నుంచి మార్కెట్ విలువలను పెంచాలని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన సంస్థలు, సంఘాలు, పౌరుల అభిప్రాయాన్ని వెల్లడించడానికి తగినంత సమయం ఇవ్వలేదు.
హేతుబద్ధంగా ఉండాలి!
ఆరు నెలల క్రితమే మార్కెట్ విలువల్ని ప్రభుత్వం పెంచింది. అప్పుడు నిర్మాణ సంఘాలు పెద్దగా వ్యతిరేకతను ప్రదర్శించలేదు. ఎందుకంటే, ఏడేండ్ల తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, అలా ఆరు నెలలు గడిచిందో లేదో.. మరోసారి ప్రతిపాదత పెరగుదల వల్ల పరిశ్రమ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. కేవలం ఆరు నెలల క్రితమే భూముల మార్కెట్ విలువల్ని 30 నుంచి 100 శాతం పెంచారు. వాణిజ్య భవనాల్లో ఎగువ అంతస్తుల్లో సుమారు 167 శాతం దాకా పెరిగింది. ట్రాన్స్ఫర్ డీడ్లపై స్టాంప్ డ్యూటీని 37.5% పెంచారు. స్ట్రక్చర్ తో పాటు మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన మార్కెట్ విలువను 45 శాతం రెట్టింపు చేశారు. గతంలో చదరపు అడుక్కీ రూ.760 ఉన్న విలువను చదరపు అడుక్కీ రూ.1,100 చొప్పున పెంచారు. జీహెచ్ఎంసీ పరిధిలో నాలా ఛార్జీలను 50 శాతం, ఇతర ప్రాంతాల్లో 67 శాతం దాకా పెంచారు. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో బెటర్మెంట్/యూజర్ ఛార్జీలను పెంచేశారు. ఇటీవల కాలంలో సిమెంటు, స్టీలు, ఇతర భవన నిర్మాణ సామగ్రి ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితిల్లో మార్కెట్ విలువల్ని పెంచడమేమిటి?
అమలులో సమస్యలు
ధరణి పోర్టల్‌కు సంబంధించి, మిస్సింగ్‌కు సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఉన్నాయి. సర్వే నంబర్లు / ద్వి-సంఖ్యలు, తప్పుగా చేర్చబడిన లక్షల ఆస్తులు.. నిషేధిత రిజిస్టర్, టైటిల్లో పూర్వీకుల చట్టపరమైన వారసులకు తప్పుగా టైటిల్ కేటాయించబడింది. కొన్ని లావాదేవీలకు తగిన మాడ్యూల్స్ లేకపోవడం మొదలైనవి. ప్రభుత్వంతో అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత.. రకరకాల సమావేశాల్ని నిర్వహించిన అనంతరం.. వాటిలో కొన్నింటిని ప్రస్తుతం పరిష్కరించారు. అంటే, కొన్ని ఆస్తుల్ని విడుదల చేశారన్నమాట. గతంలో చేసుకున్న ఒప్పందాల విషయంలో ఇంకా కొన్ని ఆస్తులు విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయా లావాదేవీలను ముగించడానికి వారికి తగిన సమయం ఇవ్వకుండా మార్కెట్ విలువల్ని పెంచడం అన్యాయం అవుతుంది. హఠాత్తుగా మార్కెట్ విలువల్ని పెంచితే మూలధనం లాభం మరియు ఆదాయ పన్నుకి సంబంధించి కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. వారు చేయని పొరపాటుకు అధిక పన్ను కట్టాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అందుకే, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
నిర్మాణ సంఘాల వినతులివే!
స్టాంప్ డ్యూటీ, నాలా ఛార్జీలు, స్ట్రక్చర్ రేట్లు, బెటర్మెంట్ ఛార్జీలను పెంచిన కొంతకాలానికే మళ్లీ మార్కెట్ విలువల్ని పెంచడం సరైన నిర్ణయం కాదు. కాబట్టి, అసాధరణంగా పెంచిన స్టాంప్ డ్యూటీ ఛార్జీలు మరియు నాలా ఛార్జీలను తగ్గించాకే మార్కెట్ విలువల్ని పెంచడం సహేతుక నిర్ణయమని నిర్మాణ సంఘాలు భావిస్తున్నాయి. ఈ మేరకు తగు నిర్ణయాన్ని తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాయి.