నిబంధనలను ఉల్లంఘించి 23 అంతస్తుల భవనాన్ని డెవలప్ మెంట్ కు అనుమతించిన వ్యవహారంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు సహా 18 మందిపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని కల్యాణ్-డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ)లో 23 అంతస్తుల వాస్తు సంకల్ప్ పుణ్యోదయ్ స్కై లాంజ్ అనే భవనాన్ని మళ్లీ డెవలప్ మెంట్ చేయడానికి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారు. దీనిపై మాజీ కార్పొరేటర్ అరుణ్ గిధ్ అన్ని ఆధారాలతో పోలీసులను ఆశ్రయించారు. అనంతరం కోర్టుకు ఫిర్యాదు చేశారు.
డెవలపర్ ఆ భవనంలో ఉంటున్న 137 మంది అద్దెదారుల నుంచి సరైన అనుమతి పొందలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా 2004 నుంచి 2021 మధ్య కాలంలో కేడీఎంసీ మాజీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది నుంచి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ విషయంలో అక్రమంగా అనుమతులు పొందారని వివరించారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన న్యాయస్థానం.. ఐదుగురు మాజీ మున్సిపల్ కమిషనర్లతోపాటు 11 మంది టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది, బిల్డర్, ఆర్కిటెక్ట్ పై కేసు నమోదు చేయాలని గతనెల 18న ఆదేశించింది.
దీంతో బజార్ పేట్ పోలీసులు మాజీ మున్సిపల్ కమిషనర్ల గోవింద్ రాథోడ్, రామంత్ సోనావానే, ఎస్ఎస్ భిసే, ఈ. రవీంద్రన్, గోవింద్ బోడ్కేలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో రవీంద్రన్, బోడ్కేలు ఐఏఎస్ అధికారులు. అలాగే డెవలపర్ హర్కచంద్ జైన్, ఆర్కిటెక్ట్ అనిల్ నిర్గుడేలతోపాటు మరో 11 మంది టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై కేసు పెట్టారు.