రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో జరిగే మోసాలకు చెక్ చెప్పే దిశగా మహారాష్ట్ర రెరా కీలక నిర్ణయం తీసుకుంది. కొనుగోలుదారులు మోసపూరిత ప్రాజెక్టుల బారిన పడి తమ సొమ్ము పోగొట్టుకోకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. ఏదైనా ప్రాజెక్టుపై ఉండే ఫిర్యాదులను రెరా వెబ్ సైట్ లో పొందుపరచనుంది. కొనుగోలుదారులు ఆయా ప్రాజెక్టులపై ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయేమో ముందుగానే చూసుకోవచ్చు. ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేవారికి ఇది చాలా సహకరిస్తుందని రెరా అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటివరకు వివిధ ప్రాజెక్టులు, ప్రమోటర్లపై రెరాకు వచ్చిన దాదాపు 16వేల ఫిర్యాదులను వెబ్ సైట్ లో పొందుపరిచినట్టు తెలిపారు. ఏ ప్రాజెక్టుపై ఎన్ని ఫిర్యాదులు ఉన్నాయి? వాటి స్థితి ఏమిటి వంటి విషయాలన్నీ అందులో తెలుసుకోవచ్చని వివరించారు. కొనుగోలుదారులకు ఇది చాలా ఉపకరిస్తుందన్నారు. ఈ వివరాలన్నీ కావాలనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు మహా రెరా చైర్ పర్సన్ అజయ్ మెహతా తెలిపారు.
వీటిని చూసిన తర్వాత ఆ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాలో వద్దో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కొనుగోలుదారులకు వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలాంటి ఫిర్యాదులన్నీ ఫిర్యాదుదారులకు, ప్రతివాదులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. ఇకపై అందరికీ ఇవి అందుబాటులోకి వస్తాయని వివరించారు.