- వర్క్ ఫ్రం హోం విధానానికి క్రమంగా ఐటీ సంస్థల స్వస్తి
- పని ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా చర్యలు
- సాంకేతిక ఏర్పాట్ల ద్వారా వైరస్ కు చెక్
కోవిడ్ మూడో వేవ్ తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి చెప్పి, తిరిగి కార్యాలయా నుంచి పని దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏప్రిల్ నుంచి దశలవారీగా ఉద్యోగులను కార్యాలయాలకు రావాలని ఇప్పటికే సమాచారం అందించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులు వారానికి మూడు సార్లు ఆఫీసుకు వస్తున్నారు. క్రమంగా ఇది వంద శాతం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండేళ్లలో ఎదురైన కోవిడ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పని ప్రదేశాల్లో కచ్చితమైన కోవిడ్ నిబంధనలు పాటించేలా చేసేందుకు రియల్టీ డెవలపర్లతో పాటు మేనేజ్ మెంట్ సంస్థలు నడుం బిగించాయి.
ఎక్కువగా వినియోగించే ప్రదేశాలను తరచుగా శానిటైజ్ చేయడంతోపాటు ముట్టుకోకుండా ఆటోమేటిక్ గా పనిచేసే డోర్లు, ఎలివేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల వైరస్ వ్యాప్తి అవకాశాలు చాలా తగ్గే అవకాశం ఉంది. అలాగే పని ప్రదేశాలను వైరస్ సహితంగా చేసేందుకు అందుబాటులో ఉన్న సాంకేతికతను కూడా వినియోగించుకుంటున్నారు. ఐసోలేషన్ చాంబర్లు, కామన్ ఏరియాల్లో స్పర్సకు తావులేని వ్యవస్థ, గాలిని శుద్ధి చేసే ఎఈఆర్వీ ఫిల్టర్లు, అన్ని రకాల వైద్య సదుపాయాల వంటివి ఏర్పాటు చేస్తున్నారు.
ఇక కొన్ని సంస్థలు ప్రస్తుతం ఉన్న జిమ్స్, గేమ్స్ రూంలతోపాటు మెడిటేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. కొన్న సంస్థలు ఆహ్లాదరకమైన వాతావరణం కల్పించడం కోసం పచ్చదనం పెంపొందిస్తున్నాయి. కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడకుండా సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేయడంతోపాటు పని ప్రదేశాల్లో ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా పలు కంపెనీలు చర్యలు చేపట్టాయి.