బిల్డర్ తో కలిసి కొనుగోలుదారులను రూ.100 కోట్ల మేర మోసం చేసిన కేసులో యూపీలోని ఘజియాబాద్ పోలీసులు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) అధికారులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఢిల్లీకి చెందిన బిల్డర్ రాజ్ కుమార్ జైన్, అతడి కుటుంబ సభ్యులపై ఓ ఎఫ్ఐఆర్ నమోదు కాగా, తాజాగా ఎస్ బీఐ అధికారులపై మరో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. రెడ్ ఏపిల్ రెసిడెన్సీ పేరుతో 2012లో రాజ్ కుమార్ జైన్ ఓ హౌసింగ్ ప్రాజెక్టు ప్రారంభించారు.
కానీ ఇప్పటివరకు దానిని పూర్తి చేయలేదు. పైగా కొనుగోలుదారుల నుంచి ఫ్లాట్ మొత్తం సొమ్మును బ్యాంకు సాయంతో వసూలు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ‘ఈ ప్రాజక్టులో ఒక ఫ్లాట్ కోసం నేను 2012లో రూ.3 లక్షలు చెల్లించాను. 2015 నాటికి ఫ్లాట్ అప్పగిస్తానని చెప్పారు. ఏడాది తర్వాత మిగిలిన మొత్తం కూడా ఇస్తూ నిర్మాణం మరింత వేగవంతం చేస్తానని చెప్పడంతో లోన్ కోసం డెవలపర్ సిబ్బంది సాయంతో ఎస్ బీఐలో దరఖాస్తు చేశాను. వెంటనే నా లోన్ మంజూరైంది.
కానీ నాకు కనీసం చెప్పకుండానే రూ.21.4 లక్షలు డెవలపర్ ఖాతాలోకి బదిలీ చేశారు. తర్వాత ఈ విషయం చెప్పారు అప్పటి నుంచి మూడేళ్ల పాటు ఈఎంఐ కట్టి, చివరకు యూపీ రెరాను ఆశ్రయించాను’ అని చంద్రప్రకాశ్ గోయెల్ అనే బాధితుడు తెలిపారు. ఇదే తరహాలో మరికొందరు నుంచి కూడా లోన్లు బదిలీ చేసుకున్నట్టు ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా ఒకే ఫ్లాట్ ను పలువురికి విక్రయించిన సంగతి కూడా బయటపడింది. దీంతో పోలీసులు ఈ నెల ఒకటిన రాజ్ కుమార్ జైన్ తోపాటు అతడి భార్య, కుమారుడు, కుమార్తె, మేనల్లుడులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు తేలడంతో వారిపైనా కేసు నమోదు చేశారు. త్వరలోనే వారిని విచారిస్తామని పోలీసులు వెల్లడించారు.