పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు.. వాటిని నియంత్రించలేని ప్రభుత్వాల వల్ల విసిగిపోయిన తెలంగాణ నిర్మాణ రంగం.. ఏప్రిల్ 4న బంద్‌ను పాటిస్తున్నామని ప్రకటించాయి. క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, అధ్యక్షుడు రామకృష్ణారావు, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి, తెలంగాణ ఛైర్మన్ రామచంద్రారెడ్డి, టీబీఎఫ్ అధ్యక్షడు సి. ప్రభాకర్ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు తదితరులు శుక్రవారం ఉదయం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
కృత్రిమంగా పెరుగుతున్న ధరల్ని చూసి నీరసించి.. తమ దీన పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేసేందుకే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు నిర్మాణ సంఘాలు ముక్తకంఠంతో వెల్లడించాయి. కనీసం ఇప్పటికైనా నిర్మాణ సామగ్రి ధరల్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సంఘాలు అంటున్నాయి. కనీసం వారం నుంచి పది రోజుల దాకా బంద్ చేయాలని తొలుత భావించామని, కాకపోతే నిర్మాణ కూలీలు చెదిరిపోతారనే ఏకైక కారణంగా కఠిన నిర్ణయం తీసుకోలేకపోయామని వివరించారు. కాకపోతే, సోమవారం బంద్ తర్వాత.. తమ తదుపరి కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు.